Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆర్టికల్ 22 ఉల్లంఘిస్తే తక్షణమే విడుదల చేయాల్సిందే!

ఆర్టికల్ 22 ఉల్లంఘిస్తే తక్షణమే విడుదల చేయాల్సిందే!

supreme court
  • సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
  • అరెస్ట్, రీ-అరెస్ట్‌పై కఠిన మార్గదర్శకాలు!

SC Guidelines On Illegal Arrest అరెస్ట్ అయిన వ్యక్తికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తే ఆ అరెస్ట్ అక్రమమని, సదరు వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అరెస్ట్‌కు సంబంధించిన కారణాలను (Grounds of Arrest) లిఖితపూర్వకంగా తెలపకపోయినా, న్యాయవాదిని సంప్రదించే అవకాశం ఇవ్వకపోయినా అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది.

జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్‌కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు 69 పేజీల సమగ్ర తీర్పును వెలువరించింది. అలాగే అక్రమంగా అరెస్ట్ అయిన వారిని తిరిగి (Re-arrest) అరెస్ట్ చేయడంపై అత్యంత కఠినమైన మార్గదర్శకాలను ఖరారు చేసింది.

రాజ్యాంగబద్ధమైన హక్కు..

అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, అరెస్ట్ కారణాలను అతనికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా ఇవ్వడం, తనకు నచ్చిన లాయర్‌ను సంప్రదించే హక్కు కల్పించడం ‘ఆర్టికల్ 22’ కింద ప్రాథమిక హక్కు. వీటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు.

చట్టం ఏదైనా నిబంధన ఒకటే..

భారతీయ న్యాయ సంహిత (BNS) కింద నమోదైన సాధారణ నేరాలైనా లేదా మనీ లాండరింగ్, ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక చట్టాలైనా ఈ నిబంధనలు అన్నింటికీ వర్తిస్తాయి. కారణాలు తెలపకుండా చేసిన అరెస్ట్ అక్రమం కాబట్టి, ఆ వ్యక్తికి దక్కేది ‘బెయిల్’ కాదు.. రాజ్యాంగ విరుద్ధమైన కస్టడీ నుంచి లభించే విడుదలగా భావించాలి.

తిరిగి అరెస్ట్ (Re-Arrest) చేయాలంటే..

ఒకే అధికారి మళ్లీ మళ్లీ అక్రమ అరెస్టేషన్లకు పాల్పడకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అరెస్ట్ కారణాలు ఇవ్వకుండా విడుదలైన వ్యక్తిని మళ్లీ అరెస్ట్ చేయాలంటే, పోలీసులు మేజిస్ట్రేట్‌కు ప్రత్యేక దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి ఎందుకు కారణాలు చెప్పలేకపోయారో రాతపూర్వక వివరణ ఇవ్వాలి.

పోలీసు దరఖాస్తుకు వారి పైఅధికారి (Superior Officer) ధృవీకరణ తప్పనిసరి. మేజిస్ట్రేట్ ఒక వారంలోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి. హక్కులను ఉల్లంఘించిన మునుపటి అధికారికి మళ్లీ అరెస్ట్ చేసే విచక్షణాధికారం ఉండదు. కేసును వేరే అధికారికి బదిలీ చేయడంతో పాటు, ఆ తొలి అధికారిపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

కేసు నేపథ్యం ఇదే..

పంజాబ్‌లో నమోదైన ఒక పోక్సో (POCSO) కేసులో అరెస్ట్ కారణాలు వెల్లడించలేదన్న నెపంతో మేజిస్ట్రేట్ నిందితుడిని విడుదల చేశారు. పోలీసులు అదే రోజు అతడిని మళ్లీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా మేజిస్ట్రేట్ నిరాకరించారు. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు రీ-అరెస్ట్‌కు అనుమతించడంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions