Japan Former PM Yoshihiko Noda ఉన్నత పదవులు అధిరోహించిన నాయకులు అధికారంలో ఉన్నంత కాలమే కాదు, పదవి దిగిపోయాక కూడా విలాసవంతమైన జీవితానికే ప్రాధాన్యమిస్తుంటారు. కానీ జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా మాత్రం దానికి భిన్నం. ఏకంగా దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, గత 40 ఏళ్లుగా తాను పాటిస్తున్న సామాజిక జీవన శైలిని ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
రైల్వే స్టేషన్ వద్ద ఉదయాన్నే నిలబడి సామాన్య ప్రయాణికులకు రాజకీయ కరపత్రాలు పంచుతూ ప్రత్యక్ష ప్రజా సంబంధాలను కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 18న చిబా ప్రావిన్స్ లోని ‘మిణామి-ఫునాబాషి’ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6:30 నుండి 8:30 గంటల మధ్య రద్దీ సమయంలో ఆయన స్వయంగా నిలబడి ప్రయాణికులకు ప్రచార పత్రాలను పంపిణీ చేశారు.
జాతీయ రాజకీయాల్లోకి రాకముందు, 1986లోనే నోడా రైల్వే స్టేషన్ల వద్ద కరపత్రాలు పంచే ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1987లో చిబా అసెంబ్లీకి, 1993లో జపాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో, సెప్టెంబర్ 2011 నుండి డిసెంబర్ 2012 వరకు జపాన్ ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
ఆయన పంచే కరపత్రాలలో విపత్తు భీమా, పిల్లల సంక్షేమం, ప్రాంతీయ పాలనా సంస్కరణల వంటి అంశాలుంటాయి. సెప్టెంబర్ 2026 నాటి ఆయన అధికారిక షెడ్యూల్‌లో కూడా రోజూ ఉదయాన్నే స్టేషన్లలో ప్రజలను కలవడం ప్రధాన నిత్యకృత్యంగా ఉంది. ఎటువంటి హంగామా లేకుండా నిలబడే ఆయనను కొంతమంది గుర్తుపట్టి పత్రాలు తీసుకోగా, మరికొందరు సామాన్య నాయకుడిగానే భావించి దాటుకెళ్తుంటారు.











