PM Modi Janmashtami Greetings శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పవిత్ర పండగను పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, సమృద్ధిని నింపాలని ఆకాంక్షించారు.
సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా స్పందిస్తూ, “మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి హృదయపూర్వక శుభాకాంక్షలు. భగవాన్ శ్రీకృష్ణుని దివ్య సందేశాలలో నిష్కామ కర్మకు సంబంధించిన ప్రగాఢమైన ప్రేరణ ఉంది. ఇది మానవాళికి నిరంతరం మార్గదర్శనం చేస్తోంది. ఆయన భక్తి, ఆరాధనకు అంకితమైన ఈ పవిత్ర సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ధనాత్మక శక్తిని, బలాన్ని నింపాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ” అని పేర్కొన్నారు.
ప్రేమ తత్వం… స్నేహ తత్వం.. నాయకత్వం…. ఇదే కృష్ణతత్వం అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని అడ్డుకోవడానికి, కురుక్షేత్ర మహా సంగ్రామంలో అర్జునుడికి కర్తవ్యబోధతో భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా పండగ శోభ..
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మధుర, బృందావనాలతో పాటు దేశంలోని ప్రధాన దేవాలయాలు, ఇళ్లలో భక్తులు ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, భజనలతో అర్ధరాత్రి కృష్ణావిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు.











