Raghurama’s message to Christians | ఆకివీడు మున్సిపాలిటీ పరిధిలోని పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు తెరదించారు.
ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మరియు శాస్త్రీయతను వివరిస్తూ ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు.
పండితుల సూచనల మేరకు దశమి ఘడియల్లో (తెల్లవారుజామున 2 గంటలకు) పనులు ప్రారంభించి, ఏకాదశి ఘడియల్లో (ఉదయం 11:25 నిమిషాలకు) విజయవంతంగా పూర్తి చేసినట్లు రఘురామ తెలిపారు.
బ్రహ్మముహూర్తంలో పనులు మొదలుపెట్టడమే తప్ప, ఇందులో ఎలాంటి రహస్యం లేదని ఆయన స్పష్టం చేశారు.
రెవెన్యూ అధికారులు పత్రాలను పరిశీలించి అది ‘రామాలయం’ అని నిర్ధారించారని, మున్సిపల్ అధికారుల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాతే పాత శిథిలాలయాన్ని తొలగించి, నేలను చదును చేసే పనులు చేపట్టామని వెల్లడించారు.
ఒక హిందూ మతస్థునిగా క్రిస్టియన్ సోదరులకు వివరణ ఇస్తున్నానని పేర్కొంటూ.. “చెరపకురా చెడేవు” అనే సామెతను గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని, శాంతి మరియు ఐక్యతను కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరారు.
బహిరంగంగానే పనులు: మధ్యాహ్నం వరకు అన్ని పనులు అందరికీ కనిపించేలా బహిరంగంగానే జరిగాయని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆయన ధృవీకరించారు.






