Thursday 3rd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!

అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!

  • మానవ హక్కుల కమిషన్ కీలక తీర్పు!

వాలిడ్ రిజర్వేషన్ టికెట్ ఉన్నప్పటికీ, ఒక మహిళా ప్రయాణికురాలిని అర్ధరాత్రి వేళ బలవంతంగా రైలు నుంచి దించేసి, టికెట్ లేదనే నెపంతో అక్రమంగా అరెస్టు చేయించిన ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) తీవ్రంగా స్పందించింది. బాధితురాలు కె. జయస్మితకు రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ రైల్వేను ఆదేశించింది.

కమిషన్ ఛైర్‌పర్సన్ జస్టిస్ అలెగ్జాండర్ థామస్ ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ, నెల రోజుల్లోగా పరిహారం చెల్లించి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను గుర్తించి, వారి నుంచి ఈ నష్టపరిహార మొత్తాన్ని వసూలు చేయాలని సూచించారు.

అసలేం జరిగింది?

జూలై 30, 2023న జయస్మిత వడక్కంచేరి నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు మంగళూరు-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ కోసం టికెట్ కౌంటర్ వద్ద టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, ఆమె తన బెర్త్ వద్దకు వెళ్లేసరికి అది మరొకరికి కేటాయించి ఉంది.

టికెట్ ఆన్‌లైన్ ద్వారా క్యాన్సిల్ అయిందని TTE తెలిపారు. కౌంటర్లో నేరుగా కొనుగోలు చేసిన టికెట్ ఆన్‌లైన్‌లో ఎలా క్యాన్సిల్ అవుతుందని ఆమె ప్రశ్నించగా, TTE సరైన సమాధానం ఇవ్వకుండా రూ. 500 జరిమానా చెల్లిస్తే వేరే బెర్త్ ఇస్తానని చెప్పారు.

రైల్వే క్లర్క్ పొరపాటు..

తదుపరి విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బుకింగ్ కౌంటర్ వద్ద ఉన్న క్లర్క్ జయస్మిత మొబైల్ నంబర్ నమోదు చేసేటప్పుడు ఒక అంకెను తప్పుగా నమోదు చేశారు. దాంతో కన్ఫర్మేషన్ మెసేజ్ వేరొక వ్యక్తికి వెళ్లడం, ఆ వ్యక్తికి సంబంధం లేని టికెట్ కావడంతో దానిని ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయడం జరిగాయి.

అర్ధరాత్రి వేధింపులు..

అర్ధరాత్రి వేళ తనను రైలు దింపవద్దని జయస్మిత అభ్యర్థించినా వినకుండా, అలువ స్టేషన్ వద్ద ఆమెను RPF సిబ్బందికి అప్పగించి అరెస్ట్ చేయించారు. ఈ అక్రమ కేసు కారణంగా జయస్మిత తన కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది.

మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యలు..

రైల్వే చట్టంలోని సెక్షన్ 137, 139లను ఉల్లంఘిస్తూ, ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలి రాజ్యాంగబద్ధమైన ‘ఆత్మగౌరవంతో జీవించే హక్కు’ను కాలరాశారని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజుల్లోగా పరిహారం చెల్లించకపోతే 8% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అలాగే, ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెకు తగిన న్యాయం చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించింది.

You may also like
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!
‘విజయ్ ఫర్ పీఎం’ నినాదంపై చెలరేగిన రాజకీయ వివాదం!
Ram Mandri
అయోధ్య ఆలయానికి రూ. 4 కోట్ల చెక్..ఖాతాలో ఉంది రూ. 3 మాత్రమే!
మరొకరితో మాట్లాడుతోందనే అనుమానంతో మోడల్ హత్య!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions