CM Revanth Tweet On 1000 Days Congress Government తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరిత పోస్ట్‌ను పంచుకున్నారు. “జన ఆకాంక్షలే కేంద్రంగా… త్యాగాల ఆశయాలే ఇంధనంగా…” సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానమిది అని ఆయన అభివర్ణించారు.
సంక్షేమం – సామాజిక న్యాయమే ధ్యేయం..
ఈ 1000 రోజుల పాలనా ప్రయాణంలో ప్రభుత్వం సాధించిన పురోగతిని, అనుసరిస్తున్న విధానాలను సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల అవసరాలను, వారి ఆత్మగౌరవాన్ని మేళవించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర దీర్ఘకాలిక భవిష్యత్తును, యువత ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి సంక్షేమాన్ని ఆచరిస్తున్నట్లు పేర్కొన్నారు. సకల వర్గాల సామాజిక న్యాయాన్ని, సమాన అవకాశాలను మేళవిస్తూ పారదర్శక పాలన సాగిస్తున్నామని వివరించారు.
కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అండతోనే ఈ విజయం సాధ్యమైందని సీఎం రేవంత్ కొనియాడారు. తెలంగాణను విశ్వవేదికపై విజయపతాకగా నిలిపే వరకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషిని కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. తన ప్రయాణంలో తోడుగా, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఆయన, ప్రజలతో తనకున్న ఈ అనుబంధం గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు.








