Friday 17th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దూసుకొచ్చిన యువకుడు.. షాక్ కు గురైన సీఎం!

దూసుకొచ్చిన యువకుడు.. షాక్ కు గురైన సీఎం!

mamta banerjee

Mamata Banerjee security breach | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. జల్పాయ్ గురి జిల్లాలో ఆమె నిర్వహిస్తున్న పాదయాత్రలో ఒక యువకుడు అకస్మాత్తుగా భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఆమె వైపు దూసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

2026 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మమతా బెనర్జీ జల్పాయ్ గురిలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. భారీ జనసందోహం మధ్య ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు పోలీసుల కళ్లను గప్పి సెక్యూరిటీ కార్డన్‌లోకి ప్రవేశించాడు.

నేరుగా ముఖ్యమంత్రి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. ఈ హఠాత్పరిణామంతో మమతా బెనర్జీ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని పక్కకు లాగేశారు.

ఈ క్రమంలో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. అనంతరం పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను స్థానిక విద్యార్థి అని తేలింది. కేవలం ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానంతో ఆశీర్వాదం కోసమే అలా చేశానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని విచారణలో వెల్లడించాడు.

ఎన్నికల వేళ ఆందోళన..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉన్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కూడా మమతా బెనర్జీ పర్యటనల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో, భద్రతా ప్రోటోకాల్స్‌ను మరింత కఠినతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత కాసేపు పాదయాత్ర నిలిచిపోయినా, మళ్ళీ యధావిధిగా కొనసాగింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions