Vijay For PM TVK Congress DMK Row తమిళనాడు రాజకీయాల్లో ‘విజయ్ ఫర్ పీఎం’ (ప్రధానమంత్రిగా విజయ్) నినాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల వెలువడిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ దేశ ప్రధాని పదవికి అగ్రశ్రేణి ఎంపికల్లో 3వ స్థానంలో (నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తదుపరి) నిలవడంతో ఈ చర్చ ఊపందుకుంది.
ద్రావిడ దిగ్గజాలను ఓడించి అధికారంలోకి వచ్చిన విజయ్ 100 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ అంశం మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర విమర్శలకు దారితీసింది.
కాంగ్రెస్ హెచ్చరిక – మంత్రివర్గం నుంచి రాజీనామా బెదిరింపు..
2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని టీవీకే సమర్థించకపోతే తమిళనాడు మంత్రివర్గం నుండి తమ కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేస్తారని మంత్రి రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. “మా నాయకుడు రాహుల్ గాంధీనే 2029లో ప్రధాని అవుతారు. దీనిని టీవీకే అంగీకరించకపోతే కాంగ్రెస్ మంత్రులు పదవుల్లో కొనసాగరు” అని ఆయన తేల్చి చెప్పారు.
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ X (ట్విట్టర్) వేదికగా ‘నక్క బూటకపు సర్వే’ (The Fox Fake Poll) పేరుతో ఒక నీతికథను ఉటంకిస్తూ సర్వేల విశ్వసనీయతను ప్రశ్నించారు. “ప్రతి సంఖ్య నిజం చెప్పదు.. ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు” అంటూ వ్యాఖ్యానించారు.
డీఎంకే, ఎండిఎంకేల ఘాటు స్పందన:
టీవీకే నేతల వాక్చాతుర్యాన్ని డీఎంకే నాయకుడు ఆర్.ఎస్. భారతి ఎగతాళి చేశారు. “వారి ఊహలకు హద్దులు లేవు… రేపు ఆయన ఐక్యరాజ్యసమితికి అధిపతి అవుతారని కూడా చెబుతారు” అని ఎద్దేవా చేశారు. విజయ్‌ను ప్రధానిగా చూపిస్తూ కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండడాన్ని ఆయన ప్రశ్నించారు.
విజయ్‌కు సన్నిహితుడు, MDMK అధినేత వైకో మాట్లాడుతూ “ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయం లేదు. విజయ్‌కు కూడా ప్రధాని కావాలనే ఆలోచన లేదా ఉద్దేశం కనీసం పావు వంతు కూడా లేదు” అని పేర్కొన్నారు.
తూత్తుకుడి సహా రాష్ట్రవ్యాప్తంగా విజయ్‌ను ప్రధానిగా కోరుతూ వెలిసిన పోస్టర్లు తమిళనాడు రాజకీయ పొత్తుల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.











