- 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు ప్రతిపాదన!
H1B Visa 60 Day Grace Period Removal | అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులు, ఐటీ ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త కొలువు వెతుక్కోవడానికి లేదా దేశం విడిచి వెళ్లేందుకు వీలు కల్పించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసే ప్రతిపాదనపై ట్రంప్ యంత్రాంగం తన సమీక్షను పూర్తి చేసింది. ఈ నిబంధన గనుక అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ టెక్కీలు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.
వైట్‌హౌస్ వద్ద సమీక్ష పూర్తి..
సమీక్ష పూర్తి: డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) “60 రోజుల విచక్షణాధికార గ్రేస్ పీరియడ్ తొలగింపు” ప్రతిపాదనను ఆగస్టు 6న వైట్‌హౌస్‌కు పంపగా, ఆగస్టు 27న దీనిపై సమీక్ష పూర్తయింది. కొన్ని మార్పులతో దీనికి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన యథావిధిగా అమల్లోనే ఉంది.
ఈ ప్రతిపాదిత నియమాన్ని త్వరలోనే ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించి, ప్రజలు మరియు నిపుణుల నుంచి అభిప్రాయాలను (Public Comments) స్వీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.
అమానవీయ నిర్ణయం: అజయ్ జైన్ భూటోరియా..
ప్రెసిడెంట్స్ అడ్వైజరీ కమిషన్ ఆన్ ఏషియన్ అమెరికన్స్ మాజీ సభ్యుడు అజయ్ జైన్ భూటోరియా ఈ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. టెక్, హెల్త్‌కేర్ రంగాల్లో కొత్త ఉద్యోగం సాధించడం, వీసా బదిలీ పత్రాల ప్రక్రియకు నెలల సమయం పడుతుంది. 60 రోజుల సమయమే తక్కువ అనుకుంటే, దాన్ని రద్దు చేస్తే కుటుంబాలు ఇల్లు సర్దుకోవడానికి, పిల్లల చదువులపై నిర్ణయం తీసుకోవడానికి కూడా సమయం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
180 రోజులకు పెంచాలని విజ్ఞప్తి..
గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని తాను 2023లోనే సిఫార్సు చేశానని గుర్తుచేశారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఫెడరల్ రిజిస్టర్‌లో కామెంట్లు పంపాలని కమ్యూనిటీ సంస్థలకు పిలుపునిచ్చారు.









