Pulasa Fish Record Price గోదావరి జిల్లాల్లో భోజన ప్రియులు ఎంతగానో ఎదురుచూసే పులస చేపల సీజన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మత్స్యకారుల వలకు చిక్కిన రెండు పులస చేపలు వేలం పాటలో మైండ్ బ్లోయింగ్ రికార్డు ధరను పలికాయి. యానాం రేవులో జరిగిన బహిరంగ వేలంలో ఈ రెండు చేపలను కలిపి ఓ మత్స్యకార మహిళ ఏకంగా రూ. 31,500 వెచ్చించి కొనుగోలు చేశారు.
రూ. 31,500 దక్కించుకున్న వేలం వివరాలు..
వేలంలో 1.300 కేజీల బరువున్న రెండు పులస చేపలు రాగా, పార్వతి అనే మత్స్యకార మహిళ పోటీపడి మరీ వాటిని సొంతం చేసుకున్నారు. ఇందులో ఒక పెద్ద చేప రూ. 24,000, మరో చేప రూ. 7,500 చొప్పున మొత్తం రూ. 31,500 పలికింది.
ఈ సీజన్లో మగ పులస చేపకు ఇంతటి భారీ ధర పలకడం ఇదే తొలిసారని స్థానిక మత్స్యకారులు పేర్కొంటున్నారు. నెల రోజుల క్రితం 1.250 కేజీల పులస రూ. 14,000కు అమ్ముడైంది.
ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి గోదావరికి వరదలు ఆలస్యమయ్యాయి. సాధారణంగా జులై, ఆగస్టు నెలల్లో గోదావరిలోకి ఎర్ర నీరు వచ్చినప్పుడు పులసల రాక ఊపందుకుంటుంది. అయితే ఈసారి వరద నీరు ఆలస్యం కావడంతో చేపల లభ్యత గణనీయంగా తగ్గిపోయింది.
ఆకాశాన్నంటుతున్న డిమాండ్..
సముద్రంలో ఉండే ఇలస చేప గుడ్లు పెట్టడానికి గోదావరి నది వైపు ఎదురీదే క్రమంలో రుచికరమైన ‘పులస’గా మారుతుంది. అరుదైన లభ్యత, అమోఘమైన రుచి కారణంగా డిమాండ్ పెరిగి ధరలు చుక్కలనంటుతున్నాయి.








