First Flight Lands in Bhogapuram Airport | ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport)లో కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జీఎంఆర్ (GMR) సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ సేవలు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం అర్థరాత్రి నుంచే భోగాపురంలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.
మొదట ‘స్కూట్ ఎయిర్లైన్స్’కు (Scoot Airlines) చెందిన విమానం రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్ బయలుదేరింది. సోమవారం ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ‘ఇండిగో’ (IndiGo) సర్వీస్ భోగాపురం చేరుకుంది.
జీఎంఆర్ ప్రతినిధులు, జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఈ విమానానికి ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులకు విశాఖ ప్రత్యేకత అయిన ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందించారు.
ఉదయం 7:30 గంటల తర్వాత తొలి విమానం భోగాపురం నుంచి హైదరాబాద్ బయలుదేరింది. ఆ తర్వాత ఉదయం 8:00 గంటలకు బెంగళూరుకు, 8:20 గంటలకు ఢిల్లీకి, 8:50 గంటలకు హైదరాబాద్కు తదుపరి సర్వీసులు బయలుదేరాయి.
తొలి వాణిజ్య విమాన సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించి ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు అందించారు. ప్రయాణికుల రవాణా కోసం విశాఖ నుంచి 20 ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
https://twitter.com/jsuryareddy/status/2089233414931337471/video/2







