BJP MLA Disguised As Beggar ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆయన నికర ఆస్తి విలువ రూ. 5,000 కోట్లకు పైమాటే.
అయితే, తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు ఆయన తన భద్రత, విలాసవంతమైన కార్లు, హోదాను పక్కనపెట్టి ఒక్కరోజు బిచ్చగాడి అవతారం ఎత్తారు. ముఖానికి మేకప్ వేసుకుని, అనాథగా మారి ఘాట్కోపర్ వీధుల్లో బిచ్చమెత్తుకున్నారు.
జైనుల చాతుర్మాసాల వేళ, ఆయన గురువు నమ్రముని మహారాజ్ ఆదేశంతో సామాన్య ప్రజల కష్టాలను, పేదరికాన్ని ప్రత్యక్షంగా అనుభవించడానికి పరాగ్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అనుభవంలో ఆయనకు విస్తుపోయే నిజాలు తెలిసాయి.
“నా మేకప్‌తో నా సొంత అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోకి వెళ్తే, నా సొంత వాచ్మెన్ నన్ను బయటకు నెట్టేశాడు” అని ఎమ్మెల్యే వెల్లడించారు. ఎప్పుడూ ఇతరులకు సాయం చేసే తన వ్యాపార మిత్రుడి వద్దకు బిచ్చగాడిలా వెళ్తే, ఆయన కూడా తనను తరిమికొట్టాడని పరాగ్ షా ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో మనుషులకు కాకుండా డబ్బు, హోదాకే విలువ ఉందనే చేదు నిజం తెలిసొచ్చిందన్నారు. అయితే కొందరు యువకులు జాలిపడి తన చేతిలో రూ. 20 ఇచ్చారని, ముంబైలో మానవత్వం ఇంకా బతికే ఉందని పేర్కొన్నారు. ఈ అనుభవంతో తనలోని అహంకారం శాశ్వతంగా తొలిగిపోయిందని, మరింత ఒదిగి ఉండటం నేర్చుకున్నానని పరాగ్ షా తెలిపారు.











