Hyderabad Liberation Day Scooty Rally హైదరాబాద్: ఎంఐఎం (AIMIM) పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు భయపడి, వారి ఆదేశాలకు తలొగ్గి గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు.
బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి ఆలయం నుంచి అసెంబ్లీ వద్దనున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు జరిగిన ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’ని ఆయన ప్రారంభించి, స్వయంగా బైక్ నడుపుతూ పాల్గొని నివాళులర్పించారు.
తెలంగాణ ఆడబిడ్డల వీరత్వం..
నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా నాటి తెలంగాణ ఆడబిడ్డలు రోకలిబండలు, కారపు ముద్దలతో ధైర్యంగా పోరాడి రజాకార్లను తరిమికొట్టిన ఘన చరిత్ర మనదని గుర్తుచేశారు.
నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు ‘హైదరాబాద్ ముక్తి దినోత్సవాలను’ అధికారికంగా నిర్వహిస్తుంటే.. ప్రధాన కేంద్రమైన తెలంగాణలో మాత్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది జరిగే చారిత్రక వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని, వీరితో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తెలంగాణ గవర్నర్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు.
త్రివిధ దళాల సైనిక కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు ప్రజలంతా పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.











