Supreme Court on Hinduism | హిందూ ధర్మంపై భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం అనేది ఒక మతం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఒక వ్యక్తి హిందువుగా కొనసాగాలంటే కచ్చితంగా గుడికి వెళ్లాలని లేదా క్రతువులు నిర్వహించాలని ఏమీ లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం మరియు మతపరమైన వివక్షపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఈ బెంచ్, “ఒక వ్యక్తి తన గుడిసెలో ఒక చిన్న దీపాన్ని వెలిగించినా, అది తన మతంపై ఉన్న నమ్మకాన్ని నిరూపించుకోవడానికి సరిపోతుంది” అని పేర్కొంది.
జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. “హిందూ మతం ఒక జీవన విధానం కాబట్టే, గుడికి వెళ్లడం లేదా ఆచారాలు నిర్వహించడం ఖచ్చితంగా చేయాల్సిన పని కాదు. ఒక వ్యక్తి సంప్రదాయబద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి విశ్వాసాలను ఎవరూ అడ్డుకోలేరు” అని వ్యాఖ్యానించారు.
విచారణ సందర్భంగా అడ్వకేట్ మోహన్ గోపాల్ మాట్లాడుతూ.. వేదాలను అత్యున్నత ప్రాధాన్యతగా అంగీకరించే వారే హిందువులని 1966లో చెప్పారని, కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ వేదాలను ఆధ్యాత్మికంగా పాటిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి స్పందనగానే కోర్టు ‘జీవన విధానం’ అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది.
ప్రతి చిన్న మతాచారాన్ని రాజ్యాంగ కోర్టుల్లో సవాలు చేయడం మొదలుపెడితే, వందల సంఖ్యలో పిటిషన్లు వస్తాయని, దానివల్ల మతాల మధ్య సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ధర్మాసనం హెచ్చరించింది.
2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పుపై వచ్చిన రివ్యూ పిటిషన్లను ఇప్పుడు ఈ తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది.







