Wednesday 13th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అసెంబ్లీలోనూ విజయ్ ఘనవిజయం..బలపరీక్షలో నెగ్గిన టీవీకే సర్కార్!

అసెంబ్లీలోనూ విజయ్ ఘనవిజయం..బలపరీక్షలో నెగ్గిన టీవీకే సర్కార్!

tvk govt wins floor test

TVK Govt Wins Floor Test | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ (TN CM Vijay), అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన ‘ఫ్లోర్ టెస్ట్’ (TN Floor Test) లో ఆయన ప్రభుత్వం ఘనవిజయం సాధించింది.

234 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118 కాగా, విజయ్ సర్కార్‌కు ఏకంగా 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడం విశేషం. విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి ఇప్పటికే 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

అయితే, బలపరీక్ష సమయంలో అన్నాడీఎంకే (AIADMK) రెబల్ వర్గం నేతలు షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గానికి చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపడం గమనార్హం. బలపరీక్ష ప్రారంభానికి ముందే డీఎంకే (DMK) మరియు డీఎండీకే ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు.

దీంతో ఖాళీగా ఉన్న ప్రతిపక్ష బెంచీల మధ్యే ఓటింగ్ ప్రక్రియ సాగింది. నలుగురు పీఎంకే ఎమ్మెల్యేలు, ఒక బిజెపి ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సింగిల్ ఓటు మెజారిటీతో గెలిచిన ఒక ఎమ్మెల్యేను బలపరీక్షలో పాల్గొనకుండా మద్రాస్ హైకోర్టు నిరోధించడంతో, ఆయన ఓటింగ్‌లో పాల్గొనలేదు.

ఎడప్పాడి పళనిస్వామి (EPS) వర్గానికి చెందిన కేవలం 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అన్నాడీఎంకేలో ఉన్న చీలిక ఈ ఓటింగ్ ద్వారా స్పష్టంగా బయటపడింది.

ఈ విజయంతో ముఖ్యమంత్రి విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో తొలి అతిపెద్ద అడ్డంకిని అధిగమించారు. అన్నాడీఎంకేలోని ఒక పెద్ద వర్గం మద్దతు కూడగట్టడం ద్వారా, రాబోయే రోజుల్లో ద్రావిడ రాజకీయాల్లో విజయ్ కీలక శక్తిగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions