Nepal Floods Trishuli 3A Tunnel Rescue నేపాల్‌ను ముంచెత్తిన వినాశకరమైన ఆకస్మిక వరదల దాటికి త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులను తొమ్మిది రోజుల తర్వాత రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశాయి. రసువా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వరద బాధితుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది.
టన్నెల్ లోపల నుంచి వినబడుతున్న గొంతులు..
రక్షించబడిన వారిని మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ షా, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్‌లుగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఎంపీ, ఇంజనీర్ శ్రీరామ్ నెయుపానే గుర్తించారు. నేపాల్ ఆర్మీ ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మరికొందరు బతికే ఉండే అవకాశం: టన్నెల్‌లో మరింత లోతుకు వెళ్లేకొద్దీ లోపలి నుంచి మరికొందరి గొంతులు వినిపిస్తున్నాయని రెస్క్యూ టీమ్‌లు తెలిపాయి. “కంగారు పడకండి, మిమ్మల్ని రక్షిస్తున్నాం” అని ఆర్మీ చెప్పగా లోపలి నుండి సమాధానం వచ్చిందని నెయుపానే వెల్లడించారు.
నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు బురద, శిథిలాలను తొలగిస్తూ టన్నెల్‌లోకి ప్రవేశించి రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ఒకవైపు ఆశలు చిగురిస్తుండగానే, మరోవైపు రసువా లాంగ్‌టాంగ్ ఖోలా జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద విషాదం వెలుగు చూసింది. టన్నెల్‌లో 150 మీటర్లు లోపలికి వెళ్లిన ఆర్మీ బృందం ఇద్దరి మృతదేహాలను వెలికితీసింది.
కనిపించకుండా పోయిన కార్మికులు..
ఈ 20 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 41 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పెరుగుతున్న మృతుల సంఖ్య: ఆగస్టు 26న వచ్చిన వరదల నుంచి ఇప్పటివరకు నేపాల్ వ్యాప్తంగా మృతుల సంఖ్య 1,259కి చేరగా, మరో 5,053 మంది గల్లంతయ్యారు. ఒక్క త్రిశూలి-3ఏ నుంచే 40 మంది, దేశవ్యాప్తంగా వివిధ విద్యుత్ ప్రాజెక్టుల నుండి 900 మందికి పైగా కార్మికులు ఇంకా కనిపించకుండా పోయారు.










