- రథంలో బాజాభజంత్రీలతో మహారాష్ట్ర కుటుంబం గ్రాండ్ వెల్కమ్!
Beed Family Welcomes Baby Girl Chariot Procession మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన దహిఫలే కుటుంబంలో నాలుగు తరాల (సుమారు 200 సంవత్సరాలు) తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శిశువు ‘గార్గి’కి, ఆమె తల్లికి కుటుంబ సభ్యులు రథం ఊరేగింపు, డప్పు వాయిద్యాలు, తాళాలు మరియు నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.
తాతయ్య లింబాజీ దహిఫలే ఆనందం..
గార్గి రాకపై ఆమె తాతయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “మా కుటుంబంలో కూతురు పుట్టడం గొప్ప అదృష్టం. ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఆడపిల్ల లేదనే వెలితి ఉండేది, ఈ రోజుతో అది తీరిపోయింది” అని సంతోషం వ్యక్తం చేశారు. తన ఇద్దరు కోడళ్లను సొంత కూతుళ్లలాగే చూసుకున్నానని, మనవరాలిని సంగీతం, నృత్యాల నడుమ రథంలో ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఆసుపత్రిలోనే మనవరాలికి ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నామని బామ్మ సురేఖ తెలిపారు. “ఈ రోజు మా ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చిందని చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.
“సాధారణంగా ప్రజలు కొడుకు కావాలని కోరుకుంటారు, కానీ కూతురు పుట్టినప్పుడు కలిగే ఆనందం, అనుభూతి వేరు. తండ్రులపై కూతుళ్లకు ఎక్కువ అనురాగం ఉంటుంది. మా పాపను ఒక పువ్వులా పెంచుకుంటాం” అని గార్గి తండ్రి అన్నారు.
సమాజానికి సానుకూల సందేశం..
సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లల జననం పట్ల కొందరిలో సంకుచిత మనస్తత్వం ఉందన్న సామాజిక వేత్త అనంద్ ఇంగ్లే, దహిఫలే కుటుంబం చేసిన ఈ వేడుకను అభినందించారు. ఈ రకమైన వేడుక సమాజానికి ఒక గొప్ప సానుకూల సందేశాన్ని ఇచ్చిందని ఆయన కొనియాడారు.







