- సరికొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
Hyd CP Sajjanar Warns About Hybrid Cyber Fraud | నగర పరిధిలో సాంప్రదాయ జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు వ్యవస్థీకృతంగా దోపిడీకి పాల్పడుతునట్లు తమ విచారణలో బయటకు వచ్చిందని ఆయన తెలిపారు.
ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం జరిపిన దర్యాప్తులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.
రద్దీ ప్రదేశాల్లో వృద్ధులు.. అమాయకులే టార్గెట్..
ఈ ముఠాలు ఒక పక్కా వ్యూహం ప్రకారం వివిధ దశల్లో నేరాలకు పాల్పడుతున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులు, బహిరంగ ప్రదేశాలలో స్మార్ట్ఫోన్లు వాడుతున్న వృద్ధులు, అమాయకులను వీరు మొదట గుర్తిస్తారు.
బాధితులు ఫోన్ వాడుతున్నప్పుడు వారు ఏ విధంగా స్క్రీన్ లాక్ (Pattern / PIN / Password) ఓపెన్ చేస్తున్నారో వెనుక నిలబడి చాలా నిశితంగా గమనిస్తారు. ఆ తర్వాత అదును చూసి బాధితుల దృష్టి మరల్చి జేబులు లేదా బ్యాగుల నుంచి మొబైల్ ఫోన్లను చోరీ చేస్తారు.
ఒకవేళ ఫోన్ లాక్ అయి ఉండి, పాస్వర్డ్ వారికి తెలియకపోతే వీరు అత్యంత చాకచక్యంగా “సోషల్ ఇంజనీరింగ్” నాటకాలకు తెరలేపుతారు. బాధితుడు తన పోయిన ఫోన్‌కు కాల్ చేయగానే నిందితులు లిఫ్ట్ చేసి, తాము బస్సు కండక్టర్ లేదా డ్రైవర్ అని, ఫోన్ బస్సులో దొరికిందని, వచ్చే స్టాప్‌లో ఇచ్చేస్తామని నమ్మిస్తారు.
ఆ తర్వాత వివరాలు సరిచూడాలనే నెపంతో బాధితుడితోనే స్క్రీన్ లాక్ పాస్వర్డ్ చెప్పించుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో రోడ్డుపై ఫోన్ దొరికిందని, వేరొకరు కూడా ఆ ఫోన్ తమదే అని క్లెయిమ్ చేస్తున్నారని చెబుతూ.. ఫోన్ మీదే అని రుజువు కావాలంటే స్క్రీన్ పాస్వర్డ్ చెప్పాలని నమ్మించి అన్‌లాక్ వివరాలు రాబడతారు.
ఫోన్ అన్‌లాక్ అవ్వగానే నిందితులు ఫోన్ గ్యాలరీ, నోట్స్, మెసేజ్‌లు, వాట్సాప్ చాట్లను పూర్తిగా జల్లెడ పడతారు. ప్రజలు సాధారణంగా గ్యాలరీలో భద్రపరుచుకునే డెబిట్/క్రెడిట్ కార్డుల ఫోటోలు, ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు, నోట్స్ యాప్‌లో రాసుకున్న పిన్‌లను సేకరిస్తారు.
చోరీ చేసిన సిమ్ కార్డు నేరగాళ్ల చేతిలోనే ఉండటంతో, ఫోన్లోని యూపీఐ (PhonePe, Google Pay, Paytm) బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేసి, వచ్చే ఓటీపీల ద్వారా నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను, యూపీఐ పిన్‌లను రీసెట్ చేస్తారు.
అనంతరం క్షణాల వ్యవధిలో బాధితుల ఖాతాల నుంచి నగదును వేరే ఖాతాలకు బదిలీ చేస్తారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ డబ్బును నేరుగా వ్యక్తిగత ఖాతాల్లోకి వేసుకోకుండా, వివిధ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ వాలెట్లు మరియు కమీషన్ ఆశచూపి సేకరించిన మ్యూల్ అకౌంట్ల ద్వారా నగదును మళ్లించి చివరకు డ్రా చేసుకుంటున్నారు.
ఇది కేవలం సాధారణ జేబుదొంగతనం మాత్రమే కాదు, పక్కా వ్యవస్థీకృత సైబర్ నెట్వర్క్. ఈ గ్యాంగ్‌లో రద్దీ ప్రదేశాలలో బాధితులను గుర్తించేవారు ఒకరైతే, ఫోన్లు చోరీ చేసేవారు మరికొందరు ఉంటారు.
స్క్రీన్ లాక్ పిన్‌లను కనిపెట్టడం, ఫోన్లో మాయమాటలు చెప్పి పాస్వర్డ్లు లాగడం కోసం ఒక విభాగం పనిచేస్తుంటే, బ్యాంకింగ్ యాప్స్ హ్యాక్ చేసి నగదు బదిలీ చేసేందుకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఇక చివరగా గేమింగ్ యాప్స్, మ్యూల్ అకౌంట్ల ద్వారా నిధులను మళ్లించి క్యాష్ చేసుకునేందుకు ప్రత్యేక నెట్వర్క్ బాధ్యతలు నిర్వహిస్తోంది.
మొబైల్ స్క్రీన్ లాక్ పాస్ వర్డ్, ఓటీపీ ఎవరితో చెప్పొద్దు..
ఈ సరికొత్త హైబ్రిడ్ సైబర్ ముఠాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఫోన్ పోయినప్పుడు ఎవరైనా లిఫ్ట్ చేసి కండక్టర్‌నని చెప్పినా లేదా ఫోన్ తిరిగి ఇచ్చేస్తామని నమ్మించినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్ స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్ లేదా బ్యాంకింగ్ ఓటీపీలను ఫోన్లో చెప్పకూడదు.
ఏటీఎం/డెబిట్ కార్డు ఫోటోలు, సీవీవీ (CVV), నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీలు, ఆధార్/పాన్ కార్డుల ఫోటోలను ఎప్పుడూ మొబైల్ గ్యాలరీలో గానీ, నోట్స్ యాప్‌లో గానీ భద్రపరుచుకోకూడదు.
యూపీఐ సేవలను ఫ్రీజ్ చేయించాలి..
ఒకవేళ ఫోన్ పోయినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి సిమ్ కార్డును తక్షణమే బ్లాక్ చేయించాలి. అలాగే వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు యూపీఐ సేవలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించాలి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక పోర్టల్ www.ceir.gov.in లో మీ మొబైల్ IMEI నంబర్ నమోదు చేసి ఫోన్‌ను వెంటనే బ్లాక్ చేయించాలి. ఒకవేళ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలి.
ముఖ్యంగా ఇంట్లోని యువత తమ కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లు, వృద్ధులకు ఈ తరహా సరికొత్త నేరాల పట్ల అవగాహన కల్పించి, వారు ప్రయాణాల్లో ఫోన్లు వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి.











