Friday 11th September 2026
12:07:03 PM
Home > తాజా > “మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

KCR Visits Peddi Sudarshan Reddy | తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు.

ఐసీయూ (ICU) వార్డుకు వెళ్లి ఉద్యమ సహచరుడి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన కేసీఆర్, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఐసీయూలో దాదాపు అరగంట సేపు ఉండి, చికిత్స అందిస్తున్న తీరుపై వైద్యుల బృందాన్ని క్షుణ్ణంగా ఆరా తీశారు.

“మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి” అంటూ యశోదా వైద్యులకు  కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స..

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆసుపత్రి వైద్యుల బృందం (డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, MD ఏఎస్ రావు, జేఎస్ రావు) కేసీఆర్‌కు వివరాలు వెల్లడించింది. నిపుణులైన డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటూ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

గుండె, ఊపిరితిత్తులు మరియు ఇతర ప్రధాన అవయవాలన్నీ పనిచేస్తున్నాయని, అయితే బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉందని వివరించారు. మెదడు పునరుత్తేజం చెందడానికి మరొక 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాతే పూర్తిస్థాయి స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని తెలిపారు.

ఎప్పటికప్పుడు ఎంఆర్‌ఐ (MRI) పరీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఐసీయూ నుంచి బయటకు వచ్చిన అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, సోదరులు శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డి, సోదరి స్వాతిలతో కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడి గుండె ధైర్యాన్ని నింపారు.

“దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదురొద్దు, ధైర్యంగా ఉండండి. డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటారు.” అని పెద్ది కుటుంబ సభ్యులకు కేసీఆర్ ధైర్యం చెప్పారు.

ఎంత ఖర్చయినా వెనకాడకుండా పెద్దిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని, అవసరమైన అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కేసీఆర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.

దాదాపు 45 నిమిషాల పాటు ఆసుపత్రిలోనే ఉన్న కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, బిఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions