Thursday 15th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!

జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!

  • ఫుకుయామా హయ్యర్‌ టెక్నికల్‌ స్కూల్‌ను సందర్శించిన మంత్రి వివేక్‌ వెంకటస్వామి
  • విద్యార్థుల పరస్పర మార్పిడి, అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాలకు తక్షణ కార్యాచరణ
  • అధ్యాపకులు, పాఠ్యాంశాలు, ప్రాక్టికల్‌ శిక్షణలో సహకారం

Minister Vivek Japan Technical School Visit వృత్తి విద్య, ప్రాక్టికల్‌ శిక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో జపాన్‌ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు శక్తి మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ఫుకుయామా హయ్యర్‌ టెక్నికల్‌ స్కూల్‌ను సందర్శించింది.

ఈ సందర్భంగా నిర్మాణ రంగంతో పాటు టెక్నికల్, వెల్డింగ్‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌ ల్యాబొరేటరీలను మంత్రి పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి ల్యాబొరేటరీల నిర్వహణ, కోర్సుల రూపకల్పన, స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు.

60 శాతం ప్రాక్టికల్‌ శిక్షణ

పాఠశాలలో సుమారు 60 శాతం ప్రాక్టికల్‌, 40 శాతం థియరీ ఆధారంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రతినిధి బృందానికి అక్కడి అధికారులు వివరించారు. కొత్తగా విద్యను అభ్యసించే విద్యార్థులతో పాటు గతంలో పని అనుభవం ఉన్నవారికీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పరిశ్రమలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వారు వివరించారు. హిరోషిమాలోని సాంకేతిక పాఠశాలలు ఉద్యోగావకాశాల్లో రికార్డులు నమోదు చేస్తున్నట్లు మంత్రికి తెలిపారు.

నిర్మాణ రంగానికి సంబంధించిన ల్యాబ్‌లో నిర్మాణ పనులు, ఇంటీరియర్‌ వర్క్స్‌పై ఇస్తున్న శిక్షణను మంత్రి పరిశీలించారు. ఏడాది కాల వ్యవధి గల ఈ కోర్సు ద్వారా ఉద్యోగాలకు అవసరమైన ప్రాక్టికల్‌ నైపుణ్యాలను అందిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు.

టెక్నికల్‌, వెల్డింగ్‌ ల్యాబ్‌లలో ప్రెసిషన్‌ వర్క్‌, ఫ్యాబ్రికేషన్‌, వివిధ విడిభాగాలను అనుసంధానం చేయడంలో ఉపయోగించే యంత్రాలు, పరికరాలను మంత్రి పరిశీలించారు. పని ప్రదేశంలో క్రమశిక్షణ, భద్రత, రక్షణ పరికరాల వినియోగం, యంత్రాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపడాన్ని అభినందించారు.

ఎలక్ట్రికల్‌ ల్యాబ్‌లో విద్యార్థులు విద్యుత్‌ వైరింగ్‌పై పొందుతున్న శిక్షణను పరిశీలించి వారితో మంత్రి మాట్లాడారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు.

పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహనాలపై శిక్షణ

ఆటోమొబైల్‌ ల్యాబ్‌ను కూడా మంత్రి సందర్శించారు. రెండేళ్ల కోర్సులో భాగంగా వాహనాల నిర్వహణపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వివరించారు. పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహనాలపై శిక్షణ అందిస్తూ ఆటోమొబైల్‌ రంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్న విధానాన్ని మంత్రి పరిశీలించారు.

ల్యాబొరేటరీల నాణ్యత, ఆధునిక పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, సాంకేతిక విద్యలో పాఠ్య బోధన–ప్రాక్టికల్‌ శిక్షణ–క్రమశిక్షణ–పరిశ్రమల అవసరాలను సమన్వయం చేస్తున్న విధానాన్ని మంత్రి అభినందించారు. తెలంగాణ సాంకేతిక విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ విధానం విలువైన పాఠాలను అందిస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు అంతర్జాతీయ శిక్షణ

వొకేషనల్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ డైరెక్టర్‌ తకమురా రేకో, ఫుకుయామా హయ్యర్‌ టెక్నికల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఇండస్ట్రియల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డివిజన్‌ డైరెక్టర్‌ ఫినోయిషి హిరోయోషితో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. తెలంగాణ–జపాన్‌ సాంకేతిక విద్యాసంస్థల మధ్య విద్యార్థుల పరస్పర మార్పిడి, అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను నిర్ణీత కాలపరిమితిలో అమలు చేసి, సాంకేతిక విద్య, అధ్యాపకుల పరస్పర మార్పిడి, పాఠ్య ప్రణాళిక అభివృద్ధి, ప్రాక్టికల్‌ శిక్షణలో విస్తృత సహకారానికి పునాదిగా నిలపాలని మంత్రి సూచించారు.

జర్మనీ తరహాలో కార్యక్రమం

జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ యువతను సిద్ధం చేసేందుకు TOMCOM ఇప్పటికే విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అనుగుణమైన సాంకేతిక శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానం, అభ్యర్థుల సన్నద్ధత, సంస్థల మధ్య సమన్వయంతో జపాన్‌ కోసం కూడా ఇదే తరహాలో వ్యవస్థీకృత కార్యక్రమాన్ని రూపొందించవచ్చని పేర్కొన్నారు.

జపాన్‌లో నైపుణ్య కార్మికులకు భారీగా డిమాండ్‌, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో జపాన్‌ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తెలంగాణ నుంచి సిద్ధం చేసి అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను విద్య, ప్రాక్టికల్‌ శిక్షణ నుంచి జపాన్‌లో ఉద్యోగాల వరకు స్పష్టమైన మార్గంగా రూపొందించాలని సూచించారు.

జపనీస్‌ భాష, సంస్కృతిపై శిక్షణ

జపాన్‌లోని విద్యాసంస్థలు, పరిశ్రమల్లో యువత సులభంగా కలిసిపోయేలా జపనీస్‌ భాషతో పాటు అక్కడి సంస్కృతి, పని విధానాలపై శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. జపాన్‌కు సంబంధించిన ప్రతి శిక్షణ, ఉద్యోగ కార్యక్రమంలో భాషా ప్రావీణ్యం, సాంస్కృతిక అవగాహన, జపనీస్‌ పని విధానాలపై పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక శిక్షణను అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థుల పరస్పర మార్పిడి, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, సంస్థల భాగస్వామ్యం, అంతర్జాతీయ వర్క్‌ఫోర్స్‌ మొబిలిటీ ద్వారా తెలంగాణ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి వివేక్ పేర్కొన్నారు.

You may also like
భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం!
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు!
రూ. 8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కిచెన్!
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions