– సత్కరించిన డీజీపీ సీవీ ఆనంద్!
- ఈగల్ ఫోర్స్‌కు కేంద్ర అవార్డు..
Telangana Eagle Force Wins National Award మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. డైరెక్టర్ సందీప్ శాండిల్య నేతృత్వంలో ‘తెలంగాణ ఈగల్ ఫోర్స్’ (Eagle Force) చేపట్టిన దర్యాప్తు, సమన్వయ చర్యలు, నిరోధక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి విశేష గుర్తింపు లభించింది.
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఈ జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 22, 23 తేదీల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడో జాతీయ స్థాయి ‘యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్’ (ANTF) అధిపతుల సమావేశంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
అత్యుత్తమ పనితీరు..
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 7 కీలక అంశాల్లో (ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ, ప్రాసిక్యూషన్ విధానం, డిమాండ్/హార్మ్ రిడక్షన్, కోఆర్డినేషన్/కెపాసిటీ బిల్డింగ్, రిసెర్చ్/అనాలిసిస్, అడ్మినిస్ట్రేషన్/లాజిస్టిక్స్) తెలంగాణ ఈగల్ ఫోర్స్ 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. లీగల్ సెర్చ్, జ్యుడీషియల్ అనాలిసిస్, సాక్షుల రక్షణ, ప్రాసిక్యూషన్ సపోర్ట్ వంటి అంశాలకు ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు వేగవంతం చేశారు.
డీజీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణ..
జిల్లాల పర్యటనల్లో ఎస్పీలు, యూనిట్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ సేకరణ, కేసుల విచారణపై డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. డ్రగ్స్ మహమ్మారి బారి నుంచి భవిష్యత్ తరాలను, యువతను కాపాడటమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ గుర్తింపు తెచ్చిన ఈగల్ ఫోర్స్ అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
సైబర్, డ్రగ్స్ కట్టడిలో తెలంగాణ టాప్..
సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల (యాంటీ నార్కోటిక్స్) కట్టడిలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని డీజీపీ స్పష్టం చేశారు.











