Rent a Grandparent | సాధారణంగా కొన్ని దేశాల్లో మనుషులను రెంట్ (Rent a Human)కి ఇచ్చే ట్రెండ్ ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ముఖ్యంగా చైనా, జపాన్ దేశాల్లో ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ రెంట్ కి లభిస్తుంటారు. ఒక రోజుకు ఇంత ఛార్జ్ చొప్పున వారికి చెల్లిస్తారు.
అయితే తాజాగా ఈ ట్రెండ్ ఇండియాలోనూ స్టార్ట్ అయ్యింది. ఆగ్రాలోని రామ్‌లాల్ అనే వృద్ధాశ్రమం “రెంట్-ఎ-గ్రాండ్ పేరెంట్” పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక్కడ కుటుంబాలు ఒక వృద్ధుడు లేదా వృద్ధురాలిని ఒక నెల పాటు తమతో ఉండటానికి ఆహ్వానించవచ్చు.
ప్రస్తుతం చిన్న కుటుంబాల్లో భార్యాభర్తలు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ తమ పిల్లలతో సమయం గడపలేకపోతున్నారు. అలాంటి వారికి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మల లోటు లేకుండా ఉండేందుకు ఈ ఆలోచనతో ముందుకు వచ్చింది రామ్ లాల్ ఆశ్రమం.
వృద్ధులను రెంట్ కు తీసుకోవడంతో వారు పిల్లలతో గడుపుతూ వారికి జ్ఞానాన్ని పంచుతారు.. అదే విధంగా ఆ వృద్ధులు కూడా తాము అనాథలం కాబోమనే ఆలోచన పోతుందని ఆశ్రమ నిర్వహాకులు భావిస్తున్నారు.
ఇలా నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలను రెంట్ కు తీసుకోవాలంటే నెలకు రూ. 11 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో సగం నేరుగా వృద్ధులకు, మిగిలిన సగం ఆశ్రమానికి వెళుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.









