- కరీంనగర్ లో ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్!
Minister Ponnam Inaugurates Centralized Kitchen | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన పోషకాహార అల్పాహారాన్ని అందించడమే లక్ష్యంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు రూ. 8 కోట్ల వ్యయంతో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మించారు. ఈ కిచెన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా కాంబినేషన్‌లో ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ఈ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
రోజుకు 50 వేల మందికి అల్పాహారం…
రోజుకు దాదాపు 50,000 మంది విద్యార్థుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కిచెన్ ద్వారా కరీంనగర్ జిల్లాలోని 17 మండలాల్లో గల 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలలకు చెందిన 49,025 మంది విద్యార్థులకు నిత్యం ఉచిత అల్పాహారం అందనుంది. ఇడ్లీ, దోశ, పూరీ, బోండా తయారీ యంత్రాలు, ఆటోమేటిక్ పాత్రలు కడిగే మిషన్లు, వెజిటేబుల్ కట్టింగ్ మిషన్లు, చట్నీ పౌడర్ యూనిట్ మరియు ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్‌లను మంత్రి పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో కలసి బ్రేక్ ఫాస్ట్..
ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా విద్యార్థులకు అల్పాహారం వడ్డించి, వారితో కలసి కూర్చుని టిఫిన్ చేశారు. ఇది రాష్ట్రంలో 6వ కేంద్రీకృత వంటశాల అని మంత్రి తెలిపారు. కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల పరిధిలోని విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
కోడంగల్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్..
2024 డిసెంబర్‌లో కోడంగల్‌లో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ వల్ల విద్యార్థుల హాజరు 75% నుండి 90%కి పెరిగిందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 31 మెగా కిచెన్‌లతో 17.72 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.
మెనూ వివరాలు (NIN సూచనల మేరకు):
సోమవారం: ఇడ్లీ – సాంబార్
మంగళవారం: పూరీ – ఆలూ కుర్మా
బుధవారం: దోశ – చట్నీ
గురువారం: ఉప్మా – చట్నీ
శుక్రవారం: మిల్లెట్ ఇడ్లీ – సాంబార్
శనివారం: బోండా – చట్నీ
(రోజు విడిచి రోజు విద్యార్థులకు పాలు అందజేస్తారు)











