Mahesh Kumar Goud Chit Chat | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఇటీవలి పరిణామాలపై మాట్లాడారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమే.. కానీ..
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమే అయినప్పటికీ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఏఐసీసీ (AICC) ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. “పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రధానం. ఏఐసీసీ నిర్దేశించిన హద్దులు, పార్టీ లైన్‌ను ఎవరు దాటినా ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవు” అని ఆయన తేల్చిచెప్పారు.
అంతర్గత వేదికలపైనే చర్చించాలి..
పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గత వేదికలపై చర్చించుకోవాలని, బహిరంగంగా మాట్లాడి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్ఠానం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతూ, తమ మధ్య గ్యాప్ ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు.
కార్యకర్తలకు గుర్తింపు..
కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, సాధారణ కార్యకర్తలకు సైతం కీలక పదవులు దక్కుతున్నాయని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామని పేర్కొన్నారు.











