Monday 21st September 2026
12:07:03 PM
Home > తాజా > గణేష్ ఊరేగింపులో మాంసం వ్యర్థాలు విసిరిన ముగ్గురు అరెస్టు!

గణేష్ ఊరేగింపులో మాంసం వ్యర్థాలు విసిరిన ముగ్గురు అరెస్టు!

Meat Thrown During Ganesh Immersion | హైదరాబాద్‌లోని మదన్నాపేట్ పోలీస్ హౌసింగ్ సొసైటీ వద్ద ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జనం మరియు అన్నదానం కార్యక్రమం జరుగుతుండగా ఒక పోలీసు హౌసింగ్ సొసైటీ భవనం పైనుంచి ఎముకలు, మాంసం వ్యర్థాలు కలిగిన ప్యాకెట్‌ను విసిరిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనకు కారణమైన ఇద్దరు మహిళలు సహా ముగ్గురు స్థానికులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన హిందూ బంధువులు, బిజెపి నాయకులు చాంచల్‌గూడ చౌరస్తా వద్ద భారీ ఎత్తున నిరసనలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

అన్నదానం వేళ అవాంఛనీయ ఘటన..

మాదన్న పేట్ పరిధిలోని 2BHK పోలీస్ హౌసింగ్ సొసైటీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గణేష్ నిమజ్జనం, అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా.. పైనుంచి గోమాంసంగా భావిస్తున్న వ్యర్థాలతో కూడిన కవర్‌ను విసిరినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు పాల్పడిన ఇద్దరు మహిళలు, మరొక వ్యక్తిని గుర్తించి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నట్లు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే వెల్లడించారు.

చంచల్‌గూడలో నిరసనలు..

ఈ ఘటన వార్త వ్యాపించడంతో బిజెపి నేతలు, హిందూ సంఘాల ప్రతినిధులు చాంచల్‌గూడ వద్దకు చేరుకుని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి నిరసనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం చాంచల్‌గూడలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

సోషల్ మీడియా పుకార్లపై విజ్ఞప్తి..

సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్లు, నిర్ధారించని సమాచారాన్ని సర్క్యులేట్ చేయవద్దని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions