- ఏడాదిన్నరలో సమగ్ర రీ-సర్వే పూర్తి చేస్తాం – మంత్రి పొంగులేటి!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీ-సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
శుక్రవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో భూ సర్వే పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, సర్వే పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
125 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక సర్వే..
Comprehensive Land Survey Telangana రాష్ట్రంలో సుమారు 125 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టామని, ప్రతి దశలో వేగం, నాణ్యత, పారదర్శకత అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. రీ-సర్వే పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని 7 జోన్లకు జోన్‌కు ఇద్దరు చొప్పున (రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి) మొత్తం 14 మంది అధికారులను ప్రత్యేక పర్యవేక్షకులుగా నియమించారు.
తొలి దశలో 2,768 గ్రామాలు..
మొదటి విడత కింద నక్షాలు లేని 365 గ్రామాలు, జిల్లాకు 70 చొప్పున 2,240 గ్రామాలు కలిపి మొత్తం 2,768 గ్రామాల్లో రీ-సర్వే వేగంగా జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 245 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, తొలి దశ సర్వేను నవంబర్ చివరినాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి మండలంలో కనీసం రెండు గ్రామాల్లో సర్వే జరిగేలా, మండలానికి రెండు ప్రత్యేక సర్వే టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తహసీల్దార్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో రియల్ టైమ్ డాష్‌బోర్డ్..
సర్వే పురోగతి, సర్వే బృందాల సమాచారం, రోవర్ల లొకేషన్ వివరాలు రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్వే పేరుతో ప్రజల నుంచి రూపాయి వసూలు చేసినా సహించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
మీడియా చిట్‌చాట్‌లో మంత్రి సంచలన వ్యాఖ్యలు..
సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి.. ఎర్రవల్లిలో ఉన్న 385 ఎకరాల్లో 45 ఎకరాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని, సర్వే కోసం మరోసారి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఎర్రవల్లి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారిన అసైన్డ్ భూములను గుర్తించి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని స్పష్టం చేశారు.











