- తమిళనాడులో ‘తాయ్ మామన్’ పథకం ప్రారంభం!
CM Vijay Becomes Thai Maman తమిళనాడు ప్రభుత్వం నూతనంగా రూపకల్పన చేసిన ‘తాయ్ మామన్’ (మామ) గోల్డ్ రింగ్ పథకానికి సీఎం విజయ్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించడమే ఈ బృహత్తర పథకం ముఖ్య ఉద్దేశం.
మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో సోమవారం జరిగిన వినూత్న కార్యక్రమంలో సీఎం విజయ్ పాల్గొని ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
స్వయంగా ఉంగరాలు తొడిగిన సీఎం..
సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన సీఎం విజయ్.. వేదికపై ముగ్గురు శిశువుల వేళ్లకు స్వయంగా ఉంగరాలు తొడిగారు. అనంతరం వేదిక దిగి వచ్చి మరో 12 మంది తల్లుల వద్దకు వెళ్లి పిల్లలను ఎత్తుకుని మురిసిపోయారు. కొందరు తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు చిన్నారులను చేతుల్లోకి తీసుకుని సంప్రదాయబద్ధంగా చెవిలో మూడుసార్లు ఉచ్ఛరించి పేర్లు పెట్టారు .
ఆసుపత్రిలోని తల్లులతో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వార్డుకు వెళ్లి మరో 10 మంది శిశువులకు ఉంగరాలు అందజేశారు.
మధురైలో ఘన స్వాగతం..
చెన్నై నుంచి మధురై విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్‌కు వేలాది మంది అభిమానులు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. రాజాజీ ఆసుపత్రి వద్ద జనసందోహం మధ్య నడుచుకుంటూ వెళ్తూ ప్రజలకు, ఆసుపత్రి సిబ్బందికి అభివాదం చేశారు.











