CM DK Shivakumar Sensational Comments కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి బెంగళూరు వచ్చి స్థిరపడిన వారిలో డజన్ మందికి పైగా ఎమ్మెల్యేలకు ఇద్దరేసి భార్యలు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడుతూ.. ఆ ఎమ్మెల్యేల పేర్లను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేసింది.
అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు..
బెంగళూరుపై పెరుగుతున్న జనాభా ఒత్తిడి, వేగవంతమైన పట్టణీకరణపై కరువు చర్చ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. కెంపేగౌడ, కేంగల్ హనుమంతయ్య, ఎస్.ఎమ్. కృష్ణ వంటి నాయకులు బెంగళూరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. బెంగళూరుకు వచ్చినవారు ఎవరూ వెనక్కి వెళ్లరని, చివరకు ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేలు కూడా వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. అలా వచ్చిన వారిలో డజన్ మందికి పైగా ఇద్దరేసి పెళ్లిళ్లు చేసుకున్నారని, కావాలంటే వారి జాబితా ఇస్తానని శివకుమార్ అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు.
బీజేపీ సీరియస్..
సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక తీవ్రంగా స్పందించారు. ఇది అనవసరమైన వ్యాఖ్య అని, ఆ ఎమ్మెల్యేలు ఎవరో పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటనతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతీ ఎమ్మెల్యేపై ఒక కత్తి వేలాడుతోందని వ్యాఖ్యానించారు.
శాసనసభ గౌరవం దెబ్బతింటుంది..
సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. శివకుమార్ సరదాగా అని ఉండవచ్చని, కానీ అసెంబ్లీ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ గౌరవానికి మంచిది కాదని హితవు పలికారు. పేర్లు వెల్లడించకపోతే ప్రజలు శాసనసభ్యులందరినీ హేళనగా చూసే ప్రమాదం ఉందన్నారు.











