TRAI new mobile recharge rules 2026 మొబైల్ రీఛార్జ్ ప్లాన్లలో వినియోగదారులకు మరింత సౌలభ్యం, ఆదా కల్పించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక సవరణలను ప్రకటించింది.
ఇకపై రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి టెలికాం సంస్థలు మొబైల్ డేటా లేకుండా (Voice & SMS-only) చౌకైన రీఛార్జ్ ప్లాన్లను వినియోగదారులకు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. టెలికామ్ వినియోగదారుల పరిరక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026 ద్వారా ట్రాయ్ ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
డేటా లేని ప్లాన్లకు సరసమైన ధరలు..
30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్రతీ డేటా ప్లాన్‌కు తగ్గట్టుగా.. సమాన వ్యాలిడిటీతో డేటా లేని (వాయిస్ కాల్స్ + SMS మాత్రమే) ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టాలి. ఈ ప్లాన్ల ధర డేటా ఆఫర్ చేసే ప్లాన్ల కంటే తక్కువగా ఉండాలి.
ప్రతీ నెల ఒకే తేదీన రీఛార్జ్..
ప్రతీ నెల ఒకే నిర్ణీత తేదీన పునరుద్ధరించుకునేలా కనీసం ఒక వాయిస్-SMS ప్లాన్‌ను టెలికాం సంస్థలు విధిగా అందించాలి. ఒకవేళ ఆ నెలలో ఆ తేదీ లేకపోతే (ఉదాహరణకు ఫిబ్రవరిలో 31 లేకపోతే) చివరి రోజున రెన్యూ అవుతుంది. ఎక్కువ వ్యాలిడిటీ (Long Validity) కోరుకునే వారి కోసం డేటా లేని ప్రత్యేక వోచర్లను కూడా పరిచయం చేయాలి.
వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు..
కేవలం కాలింగ్ కోసం మొబైల్‌ను ఉపయోగించే వారికి, ఇంట్లో Wi-Fi వాడుతూ మొబైల్ డేటా అవసరం లేని వారికి అనవసరపు డేటా ఛార్జీల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ల వల్ల ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. నెలకు ఒకే తేదీన రీఛార్జ్ అయ్యే క్యాలెండర్ మంత్ ప్లాన్లతో సంవత్సరానికి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.







