TG High Court On AV Ranganath | హైదరాబాద్‌లోని లోత్‌కుంటలో ఉన్న ఒక భూ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా తెలంగాణ హైకోర్టు సోమవారం అత్యంత కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హైడ్రా (HYDRAA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను తక్షణమే ఆ పదవి నుంచి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కారణం..
గత విచారణ సందర్భంలో, సోమవారంలోగా లిఖితపూర్వక అఫిడవిట్ ద్వారా క్షమాపణ చెప్పాలని తెలంగాణ హైకోర్టు రంగనాథ్‌ను స్పష్టంగా ఆదేశించింది.
అయితే, సోమవారం విచారణ సందర్భంగా హైడ్రా తరఫున హాజరైన న్యాయవాది, కోర్టుకు క్షమాపణ చెప్పడానికి బదులుగా ప్రత్యేకంగా మరొక పిటిషన్ దాఖలు చేస్తామని తెలియజేశారు.
ఈ వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకున్న అనంతరం, అఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రత్యేకంగా సోమవారం వరకే సమయం ఇచ్చామని కోర్టు గుర్తుచేసింది.
క్షమాపణ రాకపోవడంతో కఠిన చర్యలు..
కోర్టు విధించిన గడువు ముగిసినప్పటికీ రంగనాథ్ నుంచి ఎలాంటి లిఖితపూర్వక క్షమాపణ రాకపోవడంతో, తీవ్రంగా పరిగణించిన ఉన్నత నాయస్థానం తక్షణమే ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి (CS) ఆదేశాలు జారీ చేసింది.









