Tejashwi Yadav promises a govt job for each family | ఒక కొత్త చట్టాన్ని రూపొందించి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబానికి కచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం లభించేలా చేస్తామని కీలక హామీ ఇచ్చారు ఆర్జేడీ నేత, బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.
ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక న్యాయం కింద ఈ చారిత్రాత్మక హామీని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబాలకు కొత్త చట్టం రూపొందించి, తప్పనిసరిగా ఉద్యోగం అందించబడుతుందని హామీ ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగాలు-ఉపాధి అందించలేకపోయిందని మండిపడ్డారు.
ఆర్జేడీ నేతృత్వంలోని ఇండీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 20 రోజుల్లో ఒక ప్రత్యేక ”ఉద్యోగ-ఉపాధి చట్టం” రూపొందించి, 20 నెలల్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం అందించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గతంలో తాను ఉప ముఖ్యమంత్రి ఉన్న 17 నెలల్లో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మరియు వామపక్షాలు కలిసి ఇండీ కూటమిగా అధికారంలోని జేడీయూ, బీజేపీ, ఎల్జేపీల ఎన్డీయే కూటమితో తలపడుతున్న విషయం తెల్సిందే.









