* రూ. 1000 నోటు ప్రవేశపెట్టే ఆలోచన లేదన్న ఆర్బీఐ గవర్నర్
* 50 శాతం రూ. 2000 నోట్లు తిరిగొచ్చాయని తెలిపిన శక్తికాంత దాస్
RBI Governor కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2000 నోటును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని అందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది.
ఈ నేపథ్యంలో తాజాగా రూ. 500 నోటుకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రూ. 500 రూపాయల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవడం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా 1000 రూపాయల నోట్లను కూడా తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేదని తెలిపారు.
“RBI రూ. 500 నోట్లను ఉపసంహరించుకోవడం లేదా రూ. 1,000 డినామినేషన్‌లో నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం గురించి ఆలోచించడం లేదు. ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నాను అని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 24 కోసం రెండో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరించిన తర్వాత శక్తికాంతదాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా రూ. 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ వివరణ ఇచ్చారు. చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం వెనక్కి వచ్చాయని దాస్ తెలిపారు. తిరిగి వచ్చిన నోట్ల విలువ రూ.1.82 లక్షల కోట్లు ఉంటుదని వెల్లడించారు.
“రూ. 2,000 నోట్లలో మొత్తం రూ. 3.62 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రకటన తర్వాత, సుమారు రూ. 1.8 లక్షల కోట్ల రూ. 2,000 నోట్లు తిరిగి వచ్చాయి. ఇది సుమారుగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో దాదాపు 50 శాతం.. .,” అని వివరించారు.
తిరిగి వచ్చిన 2,000 రూపాయల నోట్లలో, 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చాయని, మిగిలినవి మార్పిడి కోసం చేరాయని దాస్ తెలిపారు.
మే 19న ఆర్‌బీఐ రూ. 2,000 కరెన్సీ నోటును చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని పేర్కొంది. సెప్టెంబరు 30 వరకు నోట్లను ఒకేసారి రూ. 20,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.