Saturday 3rd October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రియల్ హీరో స్మిత్ మచ్చార్‌ను పరామర్శించిన దుబాయ్ యువరాజు!

రియల్ హీరో స్మిత్ మచ్చార్‌ను పరామర్శించిన దుబాయ్ యువరాజు!

Indian Pilot Smith Machar Dubai Crown Prince దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ (flydubai) విమానంలో కో-పైలట్ జరిపిన భయానక దాడిని అడ్డుకుని, 172 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారతీయ హీరో, కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను (Smith Machar) దుబాయ్ యువరాజు, షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న స్మిత్‌ను పరామర్శించిన అనంతరం యువరాజు ఆయన సాహసాన్ని ప్రశంసిస్తూ, ఆయనను ఆలింగనం చేసుకున్న ఫోటోలను ‘X’ (ట్విట్టర్) లో పంచుకున్నారు.

విమానంలో ఏం జరిగింది?

ఫ్లైదుబాయ్ విమానానికి కెప్టెన్‌గా స్మిత్ మచ్చార్ వ్యవహరిస్తుండగా, ఒమన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్హమ్మమీ విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతో కాక్‌పిట్ క్రాష్ గొడ్డలితో అకస్మాత్తుగా కెప్టెన్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైనప్పటికీ, సమయస్ఫూర్తితో స్మిత్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ప్రయాణికులు లోపలికి వచ్చి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో, విధుల్లో లేని ఇతర పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ప్రపంచ నేతల ప్రశంసలు..

ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరియు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పైలట్ వీరోచితాన్ని కొనియాడారు. “మా తరపున, మరియు దేశ నాయకత్వం తరపున ఆయనకు మా సంపూర్ణ ప్రశంసలు. ఆయన మా బృందంలో భాగమైనందుకు, మా దేశ చరిత్రలో భాగమైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాం” అని దుబాయ్ యువరాజు పేర్కొన్నారు.

ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. కో-పైలట్ అల్-హమ్మామీ తీవ్రవాద భావజాలం కలిగి ఉన్నాడని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించగా, ఇందులో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందేమోనని అధికారులు ఆరా తీస్తున్నారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం మరియు స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్చార్ ఆయన ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions