- నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్!
Khairatabad Bypoll High Court Petition ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల వ్యవహారంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటుతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఉపఎన్నికకు ఈసీ రంగం సిద్ధం చేస్తున్న వేళ.. కాంగ్రెస్ నాయకురాలు, దివంగత నేత పీజేఆర్ కుమార్తె పి.విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన 2024 ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు.
2023 ఎన్నికల వివాదం..
2023 శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా పి.విజయారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయం సాధించారు. దానం నాగేందర్ ఫాం-26 అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని, దాచిపెట్టారని ఆరోపిస్తూ 2024లోనే విజయారెడ్డి హైకోర్టులో ‘ఎలక్షన్ పిటిషన్’ దాఖలు చేశారు. ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఆ పిటిషన్ ఇంకా కోర్టు విచారణలోనే ఉంది.
తాజా పిటిషన్‌లో ఏముంది..
తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌లో విజయారెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. తన పాత పిటిషన్‌పై తీర్పు రాకముందే ఉపఎన్నిక నిర్వహిస్తే తీవ్రమైన న్యాయ చిక్కులు వస్తాయని పేర్కొన్నారు. ముందుగా తన పాత ఎన్నికల పిటిషన్‌ను తేల్చాలని, అప్పటివరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించాలని కోరారు.
ఈ పిటిషన్‌లో దానం నాగేందర్, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న ఆయనపై అనర్హత వేటు వేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సెప్టెంబర్ 24న సమర్థించింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ సచివాలయం సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, 2024 ఏప్రిల్ 23 నుంచి ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం తెలంగాణ సీఈఓ ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. అయితే ఈసీ అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా, విజయారెడ్డి వేసిన తాజా పిటిషన్ రేపు కోర్టులో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.







