- ‘పెద్ది’ వివాదం వేళ ప్రెస్ నోట్ లీక్ కలకలం!
Suniel Narang resigns Telangana Film Chamber | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలున్న ‘పెద్ది’ (Peddi) సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన తరుణంలో.. ఇండస్ట్రీ పెద్దల మధ్య నడిచిన అంతర్గత వివాదాలు గుప్పుమన్నాయి.
మంగళవారం రాత్రి చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ప్రెసిడెంట్ పదవికి ఏషియన్ సినిమాస్ అధినేత, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ సంచలన రాజీనామా చేశారు.
ఛాంబర్‌లో ఏకగ్రీవ నిర్ణయాలు జరగడం లేదని, కొందరి ఏకపక్ష ధోరణి వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం ఇండస్ట్రీలో పెను తుఫాను సృష్టించింది. అసలు ఈ రాజీనామా వెనుక ఉన్న ‘పెద్ది’ సినిమా వివాదం, పర్సంటేజ్ లొల్లి మరియు ప్రెస్ నోట్ లీక్ కథాకమిషీ ఇదీ..
అసలు వివాదం ఏమిటి?
మంగళవారం సాయంత్రం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ఒక ప్రెస్ నోట్ మీడియాకు లీక్ అయ్యింది.
‘పెద్ది’ సినిమా విడుదలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని ఆ నోట్‌లో ఉంది. పెంచిన టికెట్ ధరలపై (Hiked Prices) ఎగ్జిబిటర్లకు 7.5% ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారు.
ప్రీమియర్ షోల రెంట్..
ప్రీమియర్లు లేదా బెనిఫిట్ షోల కోసం ప్రత్యేక అద్దె (Special Rent) చెల్లించడానికి కూడా నిర్మాతలు ఒప్పుకున్నారు. తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్లు ఉంటే ఇదే రూల్ వర్తిస్తుందని, ఒకవేళ పెంపు లేకపోతే తర్వాత చర్చిద్దామని ఆ నోట్‌లో పేర్కొన్నారు.
సునీల్ నారంగ్ అభ్యంతరం..
సబ్-కమిటీ సమావేశంలో ఆంధ్ర ఎగ్జిబిటర్లు ఈ ప్రపోజల్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, తెలంగాణ ఎగ్జిబిటర్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సునీల్ నారంగ్ మాత్రం.. ‘పెద్ది’ సినిమా రిలీజ్ కావడానికి ముందే థియేటర్ల ‘పర్సంటేజ్ సిస్టమ్’ (Percentage System) పై ఒక తేల్చాలని గట్టిగా పట్టుబట్టారు.
అయితే ఈ దశలో అగ్ర నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు జోక్యం చేసుకుని.. దీనిపై ఇంకా చాలా అధ్యయనం చేయాల్సి ఉందని, పైగా ‘పెద్ది’ రిలీజ్‌కు వారం రోజుల ముందు హైదరాబాద్‌లో ఎగ్జిబిటర్లు ఎవరూ అందుబాటులో ఉండరని, కాబట్టి ఇప్పుడే అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
దాంతో సునీల్ నారంగ్.. తాము తెలంగాణ ఛాంబర్‌లో చర్చించి నిర్ణయం చెప్తామంటూ కొంత సమయం అడిగారు.
నలిగిపోయిన నారంగ్..
సమావేశం ముగిసి చర్చలు నడుస్తున్న దశలోనే.. సదరు ప్రెస్ నోట్ అకస్మాత్తుగా మీడియాకు లీక్ అవ్వడం పెద్ద వివాదానికి కారణమైంది.
ఈ లీకేజీపై సునీల్ నారంగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. సురేష్ బాబు స్పందిస్తూ, ఆ ప్రెస్ నోట్ ఎలా లీక్ అయిందో తనకు తెలియదని, కనీసం దానిపై తన సంతకం కూడా లేదని పేర్కొన్నారు.
ఎగ్జిబిటర్ల ఒత్తిడి…
మరోవైపు తెలంగాణ ఎగ్జిబిటర్లు సునీల్ నారంగ్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడే గనుక పర్సంటేజ్ సిస్టమ్ ఖరారు చేయకపోతే ఈ మూమెంటం దెబ్బతింటుందని, ఆ తర్వాత ‘పారడైజ్’ (Paradise) సినిమా రిలీజ్ వరకు ఎవరూ పట్టించుకోరని వారు వాదించారు.
ఈ మొత్తం వ్యవహారంలో దిల్‌రాజు ఇప్పటికే యాక్టివ్ రోల్ పోషిస్తుండటంతో.. ఆయన సోదరుడు, నిర్మాత సిరిష్ రెడ్డి ఈ మీటింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
ఇటు నిర్మాతలు, అటు తెలంగాణ ఎగ్జిబిటర్ల మధ్య నలిగిపోయిన సునీల్ నారంగ్.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక చివరకు తన ప్రెసిడెంట్ పదవికే రాజీనామా చేసేశారు.
అయితే, తెలంగాణ ఎగ్జిబిటర్లకు ఆయనే ప్రాపర్ లీడర్ కాబట్టి, ఆయన రాజీనామాను వారు ఆమోదించే ప్రసక్తే లేదని ఇండస్ట్రీ టాక్.
80-20 ఫార్ములా.. ఫైనల్ డీల్ ఎక్కడ తేలనుంది?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. మొదటి వారం కలెక్షన్లపై నిర్మాతలు ఎగ్జిబిటర్లకు 80-20 ఫార్ములా (నిర్మాతలకు 80%, ఎగ్జిబిటర్లకు 20%) ఆఫర్ చేశారు.
కానీ, ప్రస్తుతం వస్తున్న నార్మల్ రెంట్లు ఎలాగో 20% కి సమానంగా ఉంటున్నాయి కాబట్టి, తమకు కనీసం 40% ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు.
దీనికి అదనంగా మరో 20% వదులుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. ఈ డెడ్‌లాక్ నేపథ్యంలో.. చివరకు ఈ వివాదం 75-25 లేదా 70-30 ఫార్ములా వద్దే ఫైనల్ సెటిల్‌మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.







