– కంచి స్వామీజీ, గవర్నర్ లచే తొలి స్నానం..
– భక్తుల కోసం రూ. 30.63 కోట్లతో భారీ ఏర్పాట్లు!
Saraswati Antya Pushkaralu 2026 | ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వేదికగా జరగనున్న ‘సరస్వతీ అంత్య పుష్కరాలకు’ సర్వం సిద్ధమైంది. మే 21 (గురువారం) నుండి జూన్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి.
ఈ పవిత్ర పుష్కర స్నానాల కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశవ్యాప్తంగా సుమారు 30 నుండి 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ. 30.63 కోట్ల నిధులతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
తొలి పుష్కర స్నానం – ముహూర్తం ఖరారు..
పుష్కరాల తొలిరోజైన మే 21వ తేదీ తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు పవిత్ర పుష్కర స్నానం ఆచరించి ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు.
12 రోజుల పాటు ప్రతిరోజూ ఒక ప్రముఖ పీఠాధిపతి ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం హోమాలు, సాయంత్రం వేళల్లో హారతి, తెప్పోత్సవం మరియు సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
భక్తుల సౌకర్యార్థం క్షేత్రస్థాయి ఏర్పాట్లు..
గత ఏడాది జరిగిన ఆది పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత వేసవి తీవ్రతను తట్టుకునేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
పుష్కర ఘాట్ల వద్ద కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు నిర్మించారు. భక్తుల కోసం ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
దాదాపు 1.70 లక్షల వాహనాలు వస్తాయనే అంచనాతో 245 ఎకరాల విస్తీర్ణంలో 23 ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాల్లోనే తాగునీరు, టాయిలెట్ వసతులు కల్పించారు. పార్కింగ్ స్థలాల నుండి ఘాట్‌లకు భక్తులను చేరవేసేందుకు 90 షటిల్ బస్సులను ఉచితంగా నడపనున్నారు.
నదీ తీరంలో ప్రమాదాలు జరగకుండా రెస్క్యూ బృందాలతో పాటు 100 మంది గజ ఈతగాళ్లను, సేఫ్టీ బోట్లను నియమించారు. పర్యవేక్షణ కోసం 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 300 మంది సిబ్బందితో నిరంతర పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు.
ఈ పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 1.20 కోట్ల వ్యయంతో ఒక ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రూ. 30 లక్షలతో ఇక్కడి నాగేంద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు.
తాగునీటి కోసం ప్రత్యేకంగా రెండు ఓహెచ్‌ఆర్‌సి (OHRC) ట్యాంకులను నిర్మించి, ఘాట్ల పరిసరాల్లో 500 తాత్కాలిక టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు.
300 మంది వైద్య సిబ్బందితో అలర్ట్..
ఎండల దృష్ట్యా పుష్కర ఘాట్ లోని 23 జోన్లలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 300 మంది వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
అత్యవసర సేవల కోసం ప్రధాన కేంద్రాల్లో అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. మహాదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) రెఫరల్ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు.







