Wednesday 20th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారత రాజకీయాల్లో డిజిటల్ పార్టీ.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’!

భారత రాజకీయాల్లో డిజిటల్ పార్టీ.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’!

Cockroach Janta Party | భారత రాజకీయాల్లో నిత్యం కొత్త పార్టీల ఆవిర్భావం చూస్తూనే ఉంటాం. కానీ, తాజాగా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఒక సరికొత్త పొలిటికల్ ఫ్రంట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ పార్టీ పేరే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party – CJP).

“సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (బద్ధకం)” అనే వింతైన నినాదంతో వచ్చిన ఈ పార్టీ.. “యువత కొరకు, యువత చేత నడపబడే ఒక పొలిటికల్ వేదిక” అని చాటుకుంటోంది.

ఇది కేవలం ఒక పొలిటికల్ గిమ్మిక్ లేదా మీమ్స్ ఆధారిత ప్రయోగమా? లేక నిజమైన అసమ్మతి ఉద్యమమా? అనే చర్చ పక్కన పెడితే.. ఆవిర్భవించిన కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 40,000 మంది సభ్యులను చేర్చుకుని ఈ పార్టీ రికార్డు సృష్టించింది.

అసలు ‘కాక్రోచ్’ (బొద్దింక) అనే పేరు ఎందుకు..
ఈ విచిత్రమైన పేరు వెనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి.

గత వారం ఒక కోర్టు విచారణ సందర్భంగా.. ఉద్యోగాలు లేకుండా జర్నలిజం, లా, ఆర్టీఐ (RTI) యాక్టివిజం వంటి రంగాల్లోకి ప్రవేశిస్తున్న యువతను వ్యవస్థను పాడుచేసే “బొద్దింకలు”, “పరాన్నజీవులు” (Parasites) అంటూ ఆయన పోల్చినట్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

ఆ తర్వాత తాను అలా అనలేదని, తప్పుగా వేశారని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ.. దానికి నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ సోషల్ మీడియా క్యాంపెయినర్ అభిజీత్ దిప్కే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపించారు.

టీఎంసీ నేతల చేరిక..
వ్యవస్థపై అసంతృప్తితో ఉన్న పలువురు ప్రముఖులు ఈ డిజిటల్ పార్టీతో జతకడుతున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి చెందిన ఇద్దరు లోక్‌సభ ఎంపీలు ఈ పార్టీలో చేరడం విశేషం.

కృష్ణానగర్ ఎంపీ మహూవా మోయిత్రా ఈ పార్టీ పోస్ట్‌ ను రీపోస్ట్ చేస్తూ.. “నేను కూడా ఈ పార్టీలో చేరాలనుకుంటున్నాను” అని ప్రకటించగా.. సిజెపి ఆమెను సాదరంగా ఆహ్వానించింది.

బర్ధమాన్-దుర్గాపూర్ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఈ పార్టీలో చేరడానికి అర్హతలు ఏంటని అడగగా.. “1983 వరల్డ్ కప్ గెలవడమే మీకున్న అతిపెద్ద అర్హత” అంటూ పార్టీ స్పందించింది.

సిజెపి లో చేరడానికి ‘జెన్-జీ’ (Gen-Z) అర్హతలు ఇవే..
 త్వరలోనే వర్చువల్ గా ‘జెన్-జీ కన్వెన్షన్’ నిర్వహించబోతున్న ఈ పార్టీ.. తమ సభ్యత్వానికి కొన్ని వింతైన కండిషన్లు పెట్టింది.

అవేంటంటే.. ఉద్యోగం లేకపోవడం, తీవ్రమైన బద్ధకం, నిరంతరం ఆన్‌లైన్‌లో గడపడం, ప్రొఫెషనల్‌గా దేనిపైనైనా గట్టిగా మాట్లాడగలిగే సత్తా ఉండటం. ఈ పార్టీ ఎన్నికల గుర్తుగా ‘మొబైల్ ఫోన్’ ను ప్రకటించడం గమనార్హం.

ఐదు పాయింట్ల సంచలన మేనిఫెస్టో..
కేవలం సెటైర్లకే పరిమితం కాకుండా.. విద్యార్థుల పక్షాన నిలుస్తూ నీట్, సీబీఎస్ఈ పరీక్షల అక్రమాలపై సిజెపి గళం విప్పింది.
తప్పు బోర్డులు చేసి, రీవెరిఫికేషన్ ఫీజుల పేరుతో విద్యార్థుల నుండి వసూలు చేయడం అవినీతి అని మండిపడింది. ఇందులో భాగంగానే వారు ఒక 5 పాయింట్ల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు.

‌- ఏ చీఫ్ జస్టిస్‌కూ రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వకూడదు.
– ఓటరు జాబితా నుండి సరైన ఓటును తొలగిస్తే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేయాలి. ఓటు హక్కును నిరాకరించడం ఉగ్రవాదంతో సమానం.
– పార్లమెంట్ మరియు క్యాబినెట్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
– దేశంలో మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి.
– పార్టీలు మారే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ పైనైనా 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి.

సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సూచనల మేరకు.. ఈ పార్టీ సమాచార హక్కు చట్టం (RTI) కిందికి వస్తుందని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు గానీ, సీక్రెట్ ఫండ్స్ గానీ తీసుకోబోమని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions