- జమియాత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మదానీ సంచలన డిమాండ్!
- ముస్లింలపై దాడులకు అదే శాశ్వత పరిష్కారం!
Madani demands Cow National Animal | భారతదేశంలో గోసంరక్షణ, బీఫ్ (గోమాంసం) రాజకీయాల చుట్టూ నిరంతరం వివాదాలు రేగుతున్న తరుణంలో.. ప్రముఖ ముస్లిం సంస్థ జమియాత్ ఉలేమా-ఎ-హింద్ (Jamiat Ulema-e-Hind) అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ ఒక అత్యంత ఊహించని, సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
గోవును భారతదేశ “జాతీయ జంతువు”గా ప్రకటిస్తే తాము ఎంతో సంతోషిస్తామని ఆయన బుధవారం స్పష్టం చేశారు. ఆవు పేరుతో జరుగుతున్న రాజకీయాలు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను అంతమొందించడానికి ఇదే ఏకైక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (X) లో ఆయన సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.
‘ద్వేషపూరిత రాజకీయాల’కు చెక్ పెట్టడానికే..
గోసంరక్షకుల పేరుతో ముస్లింలపై జరుగుతున్న దాడులు మరియు పెరుగుతున్న ద్వేషపూరిత వాతావరణంపై మదానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో మెజారిటీ సమాజం ఆవును కేవలం పవిత్రంగా భావించడమే కాకుండా.. తమ తల్లిగా (గోమాతగా) పూజిస్తారని మదానీ గుర్తుచేశారు. అలాంటప్పుడు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే తీర్మానాన్ని తీసుకురాకుండా ప్రభుత్వాన్ని ఏ శక్తి అడ్డుకుంటోందని ఆయన ప్రశ్నించారు.
“ఆవు పేరుతో జరుగుతున్న దాడులు, అమాయకుల హత్యలు, ద్వేషపూరిత రాజకీయాలు మరియు ముస్లింలను టార్గెట్ చేస్తూ బదనాం చేసే ఈ క్రూరమైన ఆట ఇకనైనా ముగియాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
బీఫ్ రాజకీయాలపై ‘డబుల్ స్టాండర్డ్స్’..
మదానీ తన పోస్ట్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోమాంసంపై ఉన్న విభిన్న చట్టాలను, కొందరు నేతల ద్వంద్వ విధానాలను (Double Standards) తీవ్రంగా తప్పుపట్టారు.
ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే ఆవు పేరుతో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, అదే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో బీఫ్ బహిరంగంగానే అమ్ముడవుతోందని ఆయన గుర్తుచేశారు. ఇది భక్తి కాదు.. కేవలం రాజకీయ వ్యూహం అని మండిపడ్డారు.
ఆన్-కెమరా తాము బీఫ్ తింటామని అంగీకరించిన కొందరు బీజేపీ నేతలు, మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. గోసంరక్షణ పేరిట హింసకు పాల్పడే శక్తులు ఈ నేతల ముందు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని నిలదీశారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిన తర్వాత, దాని కోసం చేసే చట్టం ఏదైనా సరే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి వివక్ష లేకుండా, ఏకరీతిగా (Uniform Law) అమలు చేయాలని మదానీ డిమాండ్ చేశారు. రాజకీయం కోసం ఏ ఒక్క మానవ ప్రాణం కూడా బలికాకూడదని ఆయన స్పష్టం చేశారు.







