Monday 4th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విభజన వాదులకు ప్రజలు బుద్ది చెప్పారు: బండి సంజయ్

విభజన వాదులకు ప్రజలు బుద్ది చెప్పారు: బండి సంజయ్

bandi sanjay comments

– ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర మంత్రి కామెంట్స్

  • కరీంనగర్ ఘటనపై బీఆర్ఎస్‌కు కౌంటర్!

Bandi Sanjay On Bengal Results | దేశాన్ని దక్షిణాది, ఉత్తరాది అంటూ విభజించాలని కుట్రలు చేసిన వారికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

కరీంనగర్‌లోని పీఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికల ఫలితాలపై ..
దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అక్కడి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారని, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  

బెంగాల్‌లో అధికారం.. కాంగ్రెస్ ముక్త్ భారత్..
బీజేపీ కార్యకర్తల అలుపెరగని పోరాటాలు, బలిదానాల వల్లే పశ్చిమ బెంగాల్‌లో అధికారం దక్కిందన్నారు. త్వరలోనే దేశంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరుతుందని, తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

చొరబాటుదారులపై తీర్పు..
బంగ్లాదేశ్ నుండి అక్రమంగా బెంగాల్‌లోకి చొరబడిన వారిని ఓటర్ల జాబితా నుండి తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారుల చెంప చెళ్లుమనేలా బెంగాల్ ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు.

పీఎంజే జువెలర్స్ ఘటనపై బీఆర్ఎస్‌కు కౌంటర్..
కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో గల పీఎంజే జువెలరీ షాపులో నిన్న జరిగిన దోపిడీ మరియు కాల్పుల ఘటనపై బండి సంజయ్ స్పందించారు.

కరీంనగర్‌లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లి దోపిడీ ఘటనలో గాయపడిన సేల్స్ మేనేజర్, సిబ్బందిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం బాధితులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ దోపిడీ ఘటనకు బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు అనడం పెద్ద జోక్ అని బండి సంజయ్ కొట్టిపారేశారు.

దేశంలో శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదనే కనీస అవగాహన కూడా బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు.

ఈ ఘటనపై ఇప్పటికే డీజీపీతో మాట్లాడానని, దుండగులను పట్టుకునేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాలు వచ్చాయని వెల్లడించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions