TVK Cadres Celebrations | తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదవుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ రాష్ట్రంలో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలకు చుక్కలు చూపిస్తూ విజయకేతనం దిశగా దూసుకుపోతోంది.
తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా విజయ్ అభిమానుల హర్షాతిరేకాలు మిన్నంటాయి. ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ (118) దిశగా దూసుకుపోతుండడంతో విజయ్ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
ఉదయం నుంచే టీవీల్లో వస్తున్న ఫలితాలను ఉత్కంఠగా గమనించిన విజయ్ అభిమానులు.. పార్టీ ఆధిక్యం స్పష్టమవడంతో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా స్వీట్లు పంచుకుంటూ ‘తమిళగ వెట్రి కళగం’ జెండాలతో సందడి చేస్తున్నారు.
మరోవైపు పార్టీ ఘనవిజయం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో చెన్నైలోని విజయ్ నివాసానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాట లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యగా ఆయన నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
దశాబ్దాల ద్రావిడ రాజకీయాల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ, విజయ్ తన ‘విజిల్ పోడు’ మేజిక్‌తో తమిళనాడులో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.







