Pawan Kalyan helps Muscat trapped woman | కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లి అక్కడ నరకం అనుభవిస్తున్న ఒక తెలుగింటి మహిళ ఆర్తనాదానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన దూదేకుల షెహనాజ్ అనే మహిళను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.
సోషల్ మీడియాలో వీడియో..
మస్కట్‌లో పని చేసేందుకు వెళ్లిన షెహనాజ్.. అక్కడ పని చేసే ప్రదేశంలో యజమానుల వేధింపులు తాళలేక సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వీడియో సందేశాన్ని పంపారు.
“ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నారు.. నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి” అంటూ ఆమె రోదిస్తూ పంపిన వీడియో అందరినీ కలచివేసింది.
చలించిపోయిన పవన్ కళ్యాణ్..
ఈ వీడియోపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఆమె మాటలు విని తీవ్రంగా చలించిపోయారు. షెహనాజ్‌ను తక్షణం స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది రంగంలోకి దిగి షెహనాజ్ భర్త ద్వారా ఒమన్‌లోని ఏజెంట్‌తో మాట్లాడారు.
అలాగే ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని (Indian Embassy), భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదించి ఆమెను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.
షెహనాజ్‌ను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా జరుగుతున్న ఈ మొత్తం ప్రక్రియను పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.







