– 25 టన్నుల కల్తీ సుగంధ ద్రవ్యాలు సీజ్ చేసిన H-FAST!
H-FAST Seizes Adulterated Spices | హైదరాబాద్‌లోని పలు వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాలపై హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) మరియు జిహెచ్ఎంసి (GHMC) ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించాయి. ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న నకిలీ సుగంధ ద్రవ్యాల (మసాలాలు) ప్రాసెసింగ్, విక్రయ ముఠాల ఆటకట్టించాయి.
13 కేంద్రాల్లో దాడులు – 25 టన్నుల కల్తీ మసాలాల స్వాధీనం:
విశ్వసనీయ సమాచారం ఆధారంగా అధికారులు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 13 వ్యాపార సంస్థలు మరియు ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. దాడుల్లో అత్యంత ప్రమాదకర రసాయనాలు కలిపిన సుమారు 25 టన్నుల కల్తీ సుగంధ ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు.
ఈ అక్రమాలపై మైలార్‌దేవ్‌పల్లి పి.ఎస్. పరిధిలో 2, బాలాపూర్ పి.ఎస్. పరిధిలో 1 కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
- రాహుల్ భాటి (కాటేదాన్)
- విశాల్ పన్వార్ (బేగంబజార్)
- దులీచంద్ కచ్చవా (బేగంబజార్)
బట్టల రంగులు, పారిశ్రామిక కెమికల్స్‌తో మసాలాల తయారీ!
తనిఖీల్లో వెలుగుచూసిన నిజాలు అధికారులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. నాసిరకం ఉత్పత్తులకు ఆకర్షణీయమైన మెరుపు, బరువు పెంచడం కోసం నిందితులు ప్రమాదకర రసాయనాలను వాడారు.
ఫ్యాబ్రిక్ డై (గుడ్డల రంగులు), పారిశ్రామిక శాశ్వత రంగులు (Industrial permanent colors), బుష్ సింథటిక్ రంగులు, షైనింగ్ టాల్కమ్ పౌడర్ మరియు రైస్ బ్రాన్ ఆయిల్.
కుళ్ళిన/తిరస్కరించిన ఆవాల స్టాక్‌కు ఫ్యాబ్రిక్ డై, పౌడర్ మరియు నూనె కలిపి ఆవాలుగా మార్చడం; లవంగాలు, షాజీరా, వాము (అజ్వైన్) ఉత్పత్తులకు సింథటిక్ రంగులు పూసి విక్రయిస్తున్నట్లు తేలింది.
సీజ్ చేసిన ప్రధాన సరుకుల వివరాలు..
- వాము (Ajwain): 7,920 కిలోలు
- జీలకర్ర (Jeera): 6,700 కిలోలు
- ఆవాలు (Mustard): 4,960 కిలోలు (ముడి సరుకు 65,000 కిలోలు)
- జీలకర్ర పొడి (Jeera Dust): 2,350 కిలోలు
- షాజీరా (Shajeera): 2,280 కిలోలు
- రోలింగ్ యంత్రాలు: 3
140 రోజుల్లో 246 టన్నుల కల్తీ ఆహారం సీజ్:
H-FAST విభాగం ప్రారంభమైన 140 రోజుల్లోనే నగరం వ్యాప్తంగా 659 దాడులు నిర్వహించి 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. మొత్తం 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకుంది.
ఈ తనిఖీల్లో బయటపడిన ఇతర దారుణాలు:
- అల్లం-వెల్లుల్లి పేస్ట్: తెల్లగా కనిపించడానికి పెయింట్లలో వాడే ‘టైటానియం ఆక్సైడ్’, ఎసిటిక్ యాసిడ్ వాడకం. 27 టన్నులకు పైగా కల్తీ పేస్ట్ స్వాధీనం.
- మాంసం వ్యర్థాలు: కుళ్ళిన కోడి, మేక మాంసంతో పాటు 60 టన్నుల కోడి వ్యర్థాలు సీజ్.
- సింథటిక్ పనీర్ & ఇతరాలు: బొట్టు పాలు లేకుండా యూరియా, డిటర్జెంట్లు, పామ్ ఆయిల్‌తో తయారు చేస్తున్న 1.5 టన్నుల సింథటిక్ పనీర్, రసాయనాలతో మగ్గబెట్టిన 25.8 టన్నుల పండ్లను గుట్టురట్టు చేశారు.
ఆహారంలో పారిశ్రామిక రంగులు, టాల్కమ్ పౌడర్లు కలపడం వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినడం. క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడం, అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు, నరాల వ్యవస్థపై దుష్ప్రభావం ఉంటుందని హెచ్చర
ప్రజా హెచ్చరిక (PUBLIC ADVISORY):
- బ్రాండ్ లేని, అతిగా మెరిసే లేదా ఆకర్షణీయ రంగుల్లో ఉండే లూజ్ మసాలాలను కొనవద్దు.
- FSSAI లైసెన్స్ ఉన్న విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి.
- కల్తీ ఆహార తయారీ సమాచారాన్ని ‘డయల్ 100’ కి లేదా H-FAST హెల్ప్‌లైన్: 8712661212 (కాల్/వాట్సాప్) కు ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం ఇచ్చేవారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయి.










