- కరీంనగర్ పార్లమెంట్‌కు తీవ్ర అన్యాయం!
Bandi Sanjay Slams Telangana Govt తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక లోటు వర్షపాతం నమోదైన చాలా మండలాలను కావాలనే జాబితా నుంచి మినహాయించారని, ప్రభుత్వం అత్యంత అశాస్త్రీయంగా, మొక్కుబడిగా ఈ జాబితాను రూపొందించిందని ధ్వజమెత్తారు. కరువు మండలాల ఎంపికలో వివక్ష చూపడం దారుణమని ఆయన మండిపడ్డారు.
కరీంనగర్‌ను కావాలనే విస్మరించారా?..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. మైనస్ 35 శాతం (-35%) కంటే ఎక్కువ లోటు వర్షపాతం ఉన్న అనేక మండలాలను కరువు జాబితాలో చేర్చకపోవడం బాధాకరమన్నారు.
హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో కరువు తాండవిస్తోందని, పొలాలన్నీ బీళ్లుగా మారి తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సి వస్తుందనే నెపంతోనే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని విస్మరించారా అని నిలదీశారు. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడితే అసలు పరిస్థితి అర్థమవుతుందన్నారు.
బండి సంజయ్ డిమాండ్లు..
కరువు మండలాలను ఎంపిక చేయడానికి ఉపయోగించిన అధికారిక గణాంకాలు, ప్రామాణికాలు ఏమిటో ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలి. ప్రతి మండలానికి సంబంధించిన వర్షపాతం లోటు, పంట నష్టం, సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భ జలాల స్థితిగతులను విడివిడిగా పరిశీలించి ఆ నివేదికలను వెల్లడించాలి. ఒక మండలంలో వర్షం పడితే పక్క మండలంలోనూ పడిందని భావించడం శాస్త్రీయ పద్ధతి కాదన్నారు.
ఫిర్యాదులను పరిశీలించి చేర్చాలి..
కరువు జాబితా నుంచి మినహాయించిన గ్రామాలు, మండలాల నుంచి వచ్చిన రైతుల ఫిర్యాదులను స్వీకరించాలని, అర్హత ఉన్న ప్రతి మండలాన్ని తక్షణమే కరువు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి వాస్తవాల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలని, బాధితులైన రైతులకు పూర్తిస్థాయి సహాయక చర్యలు అందిస్తూ పేదలకు ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. రైతులు, పేదలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.











