- ‘చింగం’ మాస పూజలు, దర్శనాల వివరాలు ఇవే!
Sabarimala Temple Opening | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర ‘చింగం’ మాస పూజల నిమిత్తం రేపు సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్నాయి.
ఆలయ ముఖ్య తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో ప్రధాన పూజారి (మేల్‌శాంతి) ప్రసాద్ ఈడీ గర్భగుడి తలుపులను తెరిచి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ముఖ్యమైన తేదీలు & పూజా వివరాలు..
మలయాళ నూతన సంవత్సర ప్రారంభ దినమైన ఆగస్టు 17న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కల్పిస్తారు.ఈ ప్రత్యేక చింగం మాస పూజలు ముగిసిన అనంతరం ఆగస్టు 21న రాత్రి 10 గంటలకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు.
అనంతరం ఓనం పండుగ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 24న ఆలయాన్ని తిరిగి పునఃప్రారంభిస్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.
భక్తులకు సౌకర్యాలు & ఆన్‌లైన్ బుకింగ్..
యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేశాయి. పంబ బేస్ క్యాంప్‌కు చేరుకోవడానికి నిలక్కల్ నుంచి 24 గంటల పాటు ఆర్టీసీ షటిల్ బస్సు సేవలను అందుబాటులో ఉంచారు.
భక్తులు ముందస్తుగా ‘శబరిమల ఆన్‌లైన్ పోర్టల్’ ద్వారా వర్చువల్ క్యూ స్లాట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.







