Super El Nino Effect | రాజన్న సిరిసిల్ల జిల్లాలో సూపర్ ఎల్ నినో ప్రభావంపై జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఐడీఓసీలో జరిగిన సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాగునీటికే రిజర్వాయర్ల నీరు
సూపర్ ఎల్ నినో ప్రభావంతో దక్షిణ భారతంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటిని వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలకే వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆరుతడి పంటలు, స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని చెప్పారు. అవసరమైన విత్తనాలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని వ్యవసాయ శాఖకు ఆదేశించారు.
భూగర్భ జలాల సంరక్షణ
గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు రెండు మీటర్లకుపైగా తగ్గాయని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. తెలంగాణ జలసిరి కింద బోర్‌వెల్ రీచార్జ్, ఫామ్ పాండ్స్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
మిషన్ భగీరథకు ప్రత్యేక ప్రణాళిక
తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా మిషన్ భగీరథ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంపింగ్‌కు అవసరమైన అదనపు మోటార్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
రైతులకు అవగాహన కార్యక్రమాలు
నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఎరువుల కొరతపై అసత్య ప్రచారాలను అరికట్టాలని అధికారులకు ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.
కలెక్టర్ ఏమన్నారంటే..
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంపై రైతులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ పంటలపై మొబైల్ సందేశాలు పంపుతున్నామని చెప్పారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను చేరుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.










