- 13 రాష్ట్రాల్లో దాడులు..
- 66 మంది అరెస్ట్..
- రూ. 101 కోట్ల మోసం!
Operation Octopus 3.0 | సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధంగా మారిన ‘ఘోస్ట్ సిమ్’ (Ghost SIM) నెట్‌వర్క్ ల అంతం కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.O’ సంచలన విజయ సాధించింది.
గతంలో మ్యూల్ బ్యాంక్ ఖాతాదారులు, అక్రమాలకు సహకరించిన బ్యాంక్ అధికారులపై ఉక్కుపాదం మోపిన నగర పోలీసులు.. ఈసారి సైబర్ నేరాలకు మూలకేంద్రమైన నకిలీ సిమ్ కార్డుల వ్యవస్థను టార్గెట్ చేశారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించి ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు రంగును బయటపెట్టాయి.
‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.O’ హైలైట్స్..
| ఆపరేషన్ వివరాలు | స్వాధీనం చేసుకున్న సమాచారం |
| నిర్వహించిన సంస్థ | హైదరాబాద్ సిటీ పోలీస్ |
| దాడులు జరిగిన రాష్ట్రాలు | దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు (18 ప్రత్యేక బృందాలు) |
| మొత్తం అరెస్టులు | 66 మంది నిందితులు (20 మంది నెట్‌వర్క్ ఏజెంట్లతో కలిపి) |
| స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డులు | 544 ఘోస్ట్ సిమ్ కార్డులు |
| జరిగిన మోసాల విలువ | సుమారు రూ. 101.87 కోట్లు |
| నమోదైన సైబర్ కేసులు | దేశవ్యాప్తంగా 76 పెద్ద నేరాలు |
షాకింగ్ మోడస్ ఆపరాండి ..
పోలీసుల విచారణలో ఈ ఘోస్ట్ సిమ్ ముఠాల మోసపూరిత విధానం అత్యంత ప్రమాదకరమైనదిగా తేలింది. అరెస్టయిన వారిలో నిబంధనలను తుంగలో తొక్కిన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్‌లకు చెందిన 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లు కూడా ఉండటం గమనార్హం.
సర్వర్ డౌన్ అని అబద్ధాలు..
గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను, అమాయక వినియోగదారులను ఈ ఏజెంట్లు టార్గెట్ చేస్తారు. ఉచిత ఇంటర్నెట్ ఆశచూపి లేదా సిమ్ తీసుకునే సమయంలో ‘సర్వర్ డౌన్’ అయ్యిందని అబద్ధం చెప్పి వారి నుంచి అదనంగా బయోమెట్రిక్ (ఫింగర్ ప్రింట్) తీసుకుంటారు.
విదేశాలకు ఈ-సిమ్ (e-SIM) బదిలీ..
ఇలా వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్న బయోమెట్రిక్‌తో యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను వెంటనే ‘ఈ-సిమ్’ (e-SIM)లుగా మారుస్తారు. ఆ డిజిటల్ ప్రొఫైల్స్ ని విదేశాల్లో (కంబోడియా, చైనా, దుబాయ్ వంటి దేశాల్లో) కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు చేరవేస్తారు.
డిజిటల్ అరెస్ట్, సెక్స్ టార్షన్ దందా..
మన దేశ నంబర్లతోనే విదేశాల నుండి వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరిచి.. డిజిటల్ అరెస్ట్, సెక్స్‌టార్షన్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ వంటి ఘోరమైన మోసాలకు పాల్పడుతున్నారు.
లక్ష్యం నెరవేరగానే ఈ సిమ్ ఏజెంట్లు ఇక్కడ తమ దుకాణాలు మూసేసి పరారవుతున్నారు.
ఈ ముప్పును శాశ్వతంగా అరికట్టడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ త్వరలోనే టెలికాం సంస్థల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం కానుంది. కేవైసీ (KYC) ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని.. నిబంధనలు పాటించని ఏజెంట్లను అన్ని నెట్‌వర్క్ ల నుంచి శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), ట్రాయ్ (TRAI) సంస్థలను కోరనుంది.
హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రజా హెచ్చరిక..
ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటానికి పోలీసులు కీలక సూచనలు చేశారు.
మీ గుర్తింపు కార్డులు, బయోమెట్రిక్ వివరాలను గుర్తుతెలియని వ్యక్తులకు లేదా అనధికారిక ఏజెంట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి.
మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ https://tafcop.sancharsaathi.gov.in ను సందర్శించి తనిఖీ చేసుకోండి.
ఒకవేళ మీవి కాని నంబర్లు ఉంటే అక్కడే బ్లాక్ చేయండి.
ఒకవేళ మీరు ఏదైనా సైబర్ మోసానికి గురైతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి గంటలోనే (గోల్డెన్ అవర్) 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి.
తద్వారా మీ పోగొట్టుకున్న డబ్బును వెంటనే హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది.







