- మహిళల భుజంపై తుపాకీ పెట్టి కొడుతున్నారు..
- ‘ప్రాతినిధ్యం తగ్గితే మరో ఉద్యమం తప్పదు’
Kavitha On Delimitation Conspiracy | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుతో ముడిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మహిళా బిల్లు అనే ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆమె ధ్వజమెత్తారు.
హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. “మహిళల భుజాలపై తుపాకీ పెట్టి, డీలిమిటేషన్ బిల్లును అమలు చేయాలని చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల అమల్లో బీసీ సబ్ కోటా ఉండాల్సిందే” అని ఆమె డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13 శాతంగా ఉంది. పునర్విభజన తర్వాత కూడా ఈ శాతం ఏమాత్రం తగ్గకూడదని కవిత స్పష్టం చేశారు. నియోజకవర్గాలను ఏకపక్షంగా (Blanket Increase) 50 శాతం పెంచుతామని చెప్పడం వల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే బీహార్ లాంటి రాష్ట్రాలకు పెరిగే సీట్లతో పోలిస్తే, మనకు దక్కే వాటా చాలా తక్కువగా ఉంటుందని, తద్వారా ఢిల్లీలో తెలంగాణ గళం బలహీనపడుతుందని వివరించారు.
“ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టినా తెలంగాణ వాటా 3.13 శాతం తగ్గడానికి వీల్లేదు. ఒకవేళ తెలంగాణ రాజకీయ ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తే, రాష్ట్ర ప్రజలు మరో తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సి ఉంటుంది” అని ఆమె కీలక హెచ్చరిక చేశారు.






