- జువ్వలదిన్నె డిఫెన్స్ ప్రాజెక్టుపై ఏపీలో ముదురుతున్న పొలిటికల్ వార్
Nara Lokesh counters Jagan | ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, ఉద్యోగ కల్పన విషయంలో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైకాపా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేటాయించిన సాగర్ డిఫెన్స్ (Sagar Defence) కంపెనీని తాము అధికారంలోకి రాగానే తరిమేస్తామన్న జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు.
ఇటీవల జువ్వలదిన్నె పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మత్స్యకారుల భూములను లాక్కొని ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి కట్టబెడుతోందని ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి రాగానే ఈ 79 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తామని ప్రకటించారు. స్థానిక మత్స్యకారులను తరిమేసేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. జగన్ వైఖరిని ‘రాక్షస మనస్తత్వం’గా అభివర్ణించారు. “తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు.. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే కంపెనీలను కూడా వెళ్లగొడతారా?” అంటూ లోకేష్ ప్రశ్నించారు.
దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ వస్తే, స్థానిక మత్స్యకారుల పిల్లలకు సుమారు 1,000కి పైగా ఉద్యోగాలు వస్తాయని, అడ్డుకోవడం అంటే వారి పొట్ట కొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిని మార్చేస్తాం.. కట్టినవి కూల్చేస్తాం.. కంపెనీలను తరిమేస్తాం అనేదే జగన్ ఫిలాసఫీ అని, ఇది రాష్ట్రాభివృద్ధికి గొడ్డలి పెట్టు అని లోకేష్ విమర్శించారు. జువ్వలదిన్నెలో ఏర్పాటు కాబోతున్న ఈ డిఫెన్స్ యూనిట్ భారత నౌకాదళానికి అవసరమైన సాంకేతిక పరికరాలను అందించడంలో కీలకం కానుంది.
అయితే మత్స్యకారుల భూముల రక్షణ వర్సెస్ పారిశ్రామికాభివృద్ధి అనే అంశం ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది.






