- కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Dead body Carried On Shoulders | తెలంగాణలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో మౌలిక సదుపాయాల కొరతను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేలా భద్రాచలంలో ఒక అత్యంత దారుణమైన, బాధాకరమైన ఘటన వెలుగుచూసింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని తరలించేందుకు కనీసం మార్చురీ వ్యాన్ (Mortuary Van) కూడా అందుబాటులో లేకపోవడంతో.. ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడుకునే స్తోమత లేని ఆ పేద కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక శవాన్ని భుజాలపైనే మోసుకుంటూ రోడ్డుపై తీసుకెళ్లారు.
ఈ హృదయవిదారక ఘటనపై భరత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పౌర సేవలు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఒక్క ఘటననే నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యం – పేదల కన్నీళ్లు..
భద్రాచలం ఏరియా ఆసుపత్రి పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఒక రోగి మరణించిన తర్వాత మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ఉచిత మార్చురీ వాహనాన్ని కేటాయించాలని కుటుంబ సభ్యులు అక్కడి అధికారులను బతిమిలాడారు.
అయితే, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో పాటు కనీస మానవత్వాన్ని కూడా మరిచిపోయారు. ప్రైవేట్ అంబులెన్స్ వాళ్లు వేల రూపాయలు డిమాండ్ చేయడంతో.. అంత డబ్బు ఇచ్చుకోలేని ఆ అభాగ్యులు శవాన్ని భుజాలపై వేసుకుని కాలినడకన బయలుదేరారు.
“బతికున్నప్పుడు అండ లేదు.. చనిపోయాక గౌరవం లేదు”.. కేటీఆర్ ఈ ఘోరమైన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పదునైన పదజాలంతో ట్విట్టర్ (X) లో విమర్శల వర్షం కురిపించారు.
“కాంగ్రెస్ పాలనలో కన్నవారే తమ కుటుంబ సభ్యుల శవాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి రావడం బాధాకరం మాత్రమే కాదు.. ఇది యావత్ తెలంగాణ ఆత్మగౌరవానికే పెద్ద మచ్చ” అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస గౌరవం దక్కట్లేదు..
బతికున్నప్పుడు ప్రజలకు ప్రభుత్వ అండ దొరకడం లేదని.. కనీసం చనిపోయిన తర్వాత కూడా మృతదేహాలకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కని పరిస్థితికి తెలంగాణను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు.
కోట్ల రూపాయల ప్రచారాలు.. ప్రజలకు మాత్రం సున్న..
ప్రభుత్వ ప్రాధాన్యతలను తప్పుబడుతూ కేటీఆర్ మరికొన్ని ఘాటైన ప్రశ్నలు వేశారు. “సభలు, సమావేశాలు, పోస్టర్లు, యాత్రలు, సీఎం హెలికాప్టర్ల షికార్ల కోసం ప్రజల సొమ్మును వందల కోట్లలో తగలేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి.. సామాన్య ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి డబ్బులు లేవా?
కనీసం మార్చురీ వ్యాన్ సదుపాయం కల్పించలేకపోవడం సిగ్గుచేటు” అని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత అంబులెన్స్ సేవలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.







