Monday 25th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ మెగా డీఎస్సీ: ఫస్ట్ ర్యాంక్ పై వైఎస్ జగన్ అనుమానం!

ఏపీ మెగా డీఎస్సీ: ఫస్ట్ ర్యాంక్ పై వైఎస్ జగన్ అనుమానం!

ఎస్సీఈఆర్టీ (SCERT) ఉద్యోగికే ఫస్ట్ ర్యాంకా?..

లోకేష్‌ను తక్షణమే తప్పించాలి

AP Mega DSC results controversy | ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ ఫలితాల చుట్టూ ఊహించని విధంగా లీకేజీలు, అవినీతి ఆరోపణల దుమారం రేగుతోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించింది మెగా డీఎస్సీనా లేక నిరుద్యోగ అభ్యర్థులను దగా చేసిన “దగా డీఎస్సీనా?” అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో, ఫలితాల ప్రకటనలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని, దీని వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఒక “డార్క్ ఆపరేషన్” సాగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

పేపర్లు లీక్ అవ్వడం, డేటా డిలీట్ కావడం, మెరిట్ లిస్టులు మాయమవడం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.

ఎస్సీఈఆర్టీ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది? – జగన్ ప్రశ్నల వర్షం..
ఈ డీఎస్సీ ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆరోపిస్తూ వైఎస్ జగన్ కొన్ని నిర్దిష్టమైన పాయింట్లను తెరపైకి తెచ్చారు.

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో, ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికే పరీక్షల్లో మొదటి ర్యాంకు (First Rank) ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు.

మెసేజ్ లీక్స్ – రహస్య జాబితాలు..
ఫలితాలను అధికారికంగా అందరికీ అందుబాటులో ఉంచకుండా.. కేవలం సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మొబైల్ మెసేజ్‌లు ఎందుకు పంపారని ప్రశ్నించారు. ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాలను కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎందుకు ప్రదర్శించలేదని అడిగారు.

రూ. 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా పోస్టుల డీల్..
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి 15 లక్షల రూపాయలకు టీడీపీ నాయకులే బేరసారాలు కుదిర్చి, డీల్స్ మాట్లాడిన మాట వాస్తవం కాదా? అని జగన్ ప్రశ్నించారు.

“మెగా లీక్ – మెగా అవినీతి” .. సీబీఐ (CBI) దర్యాప్తునకు డిమాండ్!
గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి.. కేవలం పబ్లిసిటీ కోసమే కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని జగన్ మండిపడ్డారు.

తీరా పరీక్షలు నిర్వహించాక స్కామ్‌లతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌ను మంత్రి పదవి నుండి తప్పించాలి.

ఈ మెగా డీఎస్సీ అవినీతి, లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను తక్షణమే మంత్రి పదవి నుండి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions